India-Canada: 'మోదీ,విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పేర్లు ప్రస్తావించలేదు'.. భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా
ఖలిస్థానీ అనుకూలవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారతదేశం, కెనడా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో, ఇటీవల కెనడా మీడియా ప్రముఖమైన కథనాన్ని ప్రచురించగా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరును అందులో ప్రస్తావించడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణగా కెనడా ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది, అందులో పత్రికల కథనాలను అవాస్తవంగా పేర్కొంది.
కెనడా ప్రభుత్వం ప్రకటన
"ప్రజల భద్రతకు ముప్పు ఉండడంతో, అక్టోబర్ 14న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు కొన్ని చర్యలు చేపట్టారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు కెనడాలో నేర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పలు వ్యాఖ్యలు వెలువడినప్పటికీ, దీనికి సంబంధించిన సాక్ష్యాలు లేవు. ముఖ్యంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్లు ప్రస్తావించబడ్డట్లు కెనడా ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ కథనాలు ఊహాజనితం, అవాస్తవం" అని ప్రకటనలో స్పష్టం చేసింది.
వివాదానికి కారణం ఏమిటి?
కెనడాలో ప్రచురితమైన 'ది గ్లోబ్ అండ్ మెయిల్' అనే వార్తాపత్రిక నిజ్జర్ హత్య గురించి చేసిన కథనం ఉద్రిక్తతకు కారణమైంది. ఈ కథనంలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ హత్య కుట్రలో భాగమని పేర్కొనడమే కాక, నరేంద్ర మోదీ పేరును కూడా చేర్చారు. దీనిపై భారత్ తీవ్ర విమర్శలు చేస్తూ, ఈ కథనాలను హాస్యాస్పదం,నిరాధారమని ఖండించింది. ఇలాంటి అబద్దపు కథనాలు ఇప్పటికే దెబ్బతిన్న ఇరు దేశాల సంబంధాలను మరింత దిగజారుస్తాయని భారత్ హెచ్చరించింది.
భారత్-కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారుతుందా?
2023లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్యపై భారత ప్రభుత్వ హస్తం ఉందని వ్యాఖ్యానించిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా పరిణామాల ప్రకారం, నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చడం, భారత్ స్పందనలో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకోవడం, కెనడా అధికారులను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోవడం గమనార్హం.