Canada: అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్.. 700 అమెరికా వస్తువులపై భారీ టారిఫ్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది. అమెరికా విధించిన భారీ టారిఫ్‌లకు ప్రతీకారంగా కెనడా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన 700 అమెరికా ఉత్పత్తులపై 15 నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త టారిఫ్‌లు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
వివరాలు
స్టీల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు..
కెనడా తాజాగా ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావం అమెరికాలోని పలు కీలక పరిశ్రమలపై పడనుంది.
ముఖ్యంగా స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను టారిఫ్‌ల పరిధిలోకి తీసుకొచ్చింది.
అమెరికా ఏ స్థాయిలో సుంకాలు విధించిందో.. దానికి సమానమైన స్థాయిలోనే తమ టారిఫ్‌లు ఉంటాయని కెనడా అధికారులు స్పష్టం చేశారు.
కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితి తమ దేశానికి ఎన్నడూ ఎదురుకాని సవాలని పేర్కొన్నారు.
అయినప్పటికీ ఈ సవాలును ఎదుర్కొనేందుకు కెనడా పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా నిర్ణయానికి ప్రతిస్పందించే విషయంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు.
వివరాలు
చర్చలు విఫలం.. కెనడా కీలక నిర్ణయం
అమెరికా, కెనడా మధ్య టారిఫ్‌లపై జరిగిన చర్చలు ఎలాంటి పరిష్కారానికి దారితీయలేదు.
అమెరికా ప్రతిపాదించిన కొత్త వాణిజ్య నిబంధనలు కెనడా ప్రయోజనాలకు అనుకూలంగా లేవని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ అభిప్రాయపడ్డారు.
అమెరికా ప్రతిపాదనలు ఆర్థికంగా అన్యాయంగా ఉండటంతో పాటు కెనడాకు లభించాల్సిన వాణిజ్య ప్రయోజనాలను తగ్గించేలా ఉన్నాయని కార్నీ ఆరోపించారు.
ముఖ్యంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం వంటి కెనడా ప్రధాన పరిశ్రమలకు నష్టం కలిగించే విధంగా ఆ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు.
ఈ కారణాలతో అమెరికా ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించకుండా చర్చల నుంచి వైదొలిగినట్లు కార్నీ స్పష్టం చేశారు.
వివరాలు
ట్రంప్ హెచ్చరిక.. మరిన్ని టారిఫ్‌లకు సంకేతం
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడాపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు.
అమెరికా నిర్ణయాలకు అనుగుణంగా కెనడా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
లేదంటే ఇప్పటికే అమల్లో ఉన్న టారిఫ్‌ల కంటే మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంతేకాకుండా కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై వచ్చే ఏడాది నుంచి అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు.
కెనడా చాలా ఏళ్లుగా అమెరికాకు వాణిజ్యపరంగా నష్టం కలిగిస్తోందని ట్రంప్ ఆరోపించారు.
ముఖ్యంగా అమెరికా రైతులు ఉత్పత్తి చేసే వస్తువులపై కెనడా విధిస్తున్న అధిక సుంకాలను ఆయన తీవ్రంగా విమర్శించారు.
వివరాలు
వాణిజ్య యుద్ధం ఎటువైపు?
దీంతో ఇరు దేశాలు పరస్పరం టారిఫ్‌లు విధించుకుంటుండటంతో స్టీల్,ఆటోమొబైల్,వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
అమెరికా విధించిన సుంకాలకు కెనడా ప్రతీకార చర్యలు చేపట్టడం.. మరోవైపు కెనడాపై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇరు దేశాలు చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటాయా? లేక టారిఫ్‌ల పోరు మరింత తీవ్ర రూపం దాల్చుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వాణిజ్య యుద్ధం ఇలాగే కొనసాగితే దాని ప్రభావం రెండు దేశాల పరిశ్రమలకే కాకుండా చివరకు వినియోగదారులపైనా పడే అవకాశం ఉంది.