220-Tonne Hotel: ఆశ్చర్యం! సబ్బుల సాయంతో 220 టన్నుల బిల్డింగ్‌ను తరలించారు.. అదెలాగో తెలుసుకోండి
220-Tonne Hotel In Canada: సాంకేతికత అనేది అసాధ్యం అనిపించే వాటిని సుసాధ్యం చేస్తుంది. తాజాగా కెనడాలో ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కనిపించింది. సరికొత్త సాంకేతికతతో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ 197 సంవత్సరాల పురాతన భవనాన్ని కూల్చివేయకుండా, సురక్షింతంగా వేరే ప్రాంతానికి తలరించింది. కెనడాలోని నోవా స్కోటియాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 220 టన్నుల బరువున్న పురాతన హోటల్ భవనాన్ని ఎవరూ ఊహించని రీతిలో మనం స్నానం చేసే సబ్బుల సాయంతో ఒకచోట నుంచి మరో చోటుకు మార్చారు. బిల్డింగ్‌ను తరలించేందుకు దాదాపు 700 బార్ల సబ్బును ఉపయోగించారు. ఆ భారీ భవనాన్ని మార్చే వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోను చూసిన ప్రజలు ఆశర్యపోతున్నారు.
1826లో హోటల్ నిర్మాణం..
హాలిఫాక్స్‌లోని ఈ భవనం 1826 సంవత్సరంలో ఒక ఇల్లుగా నిర్మించారు. తరువాత దీనిని విక్టోరియన్ ఎల్మ్‌వుడ్ హోటల్‌గా మార్చారు. కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ఆ భారీ బిల్డింగ్‌ను కూల్చాలని నిర్ణయించింది. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ కంపెనీ 'గెలాక్సీ ప్రాపర్టీస్' దానిని కొనుగోలు చేసింది. అనంతరం ఆ హోటల్‌ను వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళికలు రచించింది. అందులో విజయవంతమై.. కూల్చివేత నుంచి ఆ పురాతన నిర్మాణాన్ని కాపాడింది. 'గెలాక్సీ ప్రాపర్టీస్' సంస్థ ఈ హోటల్‌ను వేరే ప్రదేశానికి తరలించే బాధ్యతను ఎస్.రష్టన్ కన్స్ట్రక్షన్ సంస్థకు అప్పగించింది. భవనాలను ఒక ప్రదేశం నుంచి మరోకొ ప్రదేశానికి మార్చడంలో ఎస్.రష్టన్ కన్స్ట్రక్షన్ సంస్థకు విశేష అనుభవం ఉంది.
భవనం చాలా మృదువుగా ఉన్నందునే ఐవరీ సబ్బుల వినియోగం
హోటల్ భవనం చాలా మృదువుగా ఉన్నందున రోలర్లను ఉపయోగించకుండా.. స్టీల్ ఫ్రేమ్‌పైకి దింపడానికి ఐవరీ సబ్బును ఉపయోగించాలని ఎస్.రష్టన్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్ణయించింది. అనుకున్నట్లుగానే 700 ఐవరీ సబ్బుల సాయంతో విజయవంతంగా కదిలించింది. భవనాన్ని తరలిస్తున్న వీడియోను నిర్మాణ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. అందులో హోటల్‌ను సబ్బుల సహాయంతో 30 అడుగుల దూరం తరలించినట్లు చూపించింది. కొత్త పునాది సిద్ధమైన తర్వాత.. ఆ బిల్డింగ్‌ను అనుకున్న ప్రదేశానికి తరలిస్తామని కంపెనీ వెల్లడించింది. చారిత్రక, పురాతన భవనాలను రక్షించడానికి ఇదొక మంచి ప్రణాళికగా రియల్ ఎస్టేట్ కంపెనీ 'గెలాక్సీ ప్రాపర్టీస్' పేర్కొంది.