Canada: మార్క్ కార్నీ భారత పర్యటనకు ముందు కెనడా కీలక నిర్ణయం.. తహవ్వుర్ రాణా పౌరసత్వం రద్దుకు చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) భారత పర్యటనకు సిద్ధమవుతున్న వేళ, ఆ దేశ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముంబయి ఉగ్రదాడుల కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తింపు పొందిన తహవ్వుర్ హుస్సేన్ రాణా(Tahawwur Hussain Rana)కు కెనడాలో కల్పించిన పౌరసత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు ప్రారంభించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం తహవ్వుర్ భారత్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారుల కస్టడీలో ఉన్నాడు. 1997లో అతడు కెనడాకు వలస వెళ్లాడు.అనంతరం 2001లో ఇమిగ్రేషన్,రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (Immigration,Refugees and Citizenship Canada-IRCC) అతనికి కెనడా పౌరసత్వం మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం ఆ పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను ఐఆర్‌సీసీ ప్రారంభించింది.
వివరాలు
టొరంటో నివాసి
ఈ నిర్ణయం అతనిపై ఉన్న ఉగ్రవాద ఆరోపణల కారణంగా తీసుకున్నది కాదని, పౌరసత్వం పొందే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించాడన్న ఆరోపణల ఆధారంగానే చర్యలు చేపట్టినట్లు ఐఆర్‌సీసీ స్పష్టం చేసింది. పౌరసత్వ దరఖాస్తులో తాను టొరంటోలో నివసిస్తున్నానని రాణా పేర్కొన్నప్పటికీ, ఆ సమయంలో అతను షికాగోలో ఉన్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. ఈ అంశంపై గత కొన్ని సంవత్సరాలుగా దర్యాప్తు కొనసాగుతోంది.