LOADING...
Indian student visa: కెనడా కఠిన నిర్ణయం.. భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణ

Indian student visa: కెనడా కఠిన నిర్ణయం.. భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులపై భారీగా తిరస్కరణలు నమోదయ్యాయి. ఉన్నత విద్య కోసం కెనడా విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసిన ప్రతి నలుగురిలో ముగ్గురి వీసాలను అక్కడి అధికారులు రద్దు చేసినట్లు సమాచారం. కెనడా ఇమిగ్రేషన్‌ విభాగం (Canada's Immigration Department) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 ఆగస్టు నాటికి భారతీయ విద్యార్థులు సమర్పించిన దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరించబడ్డాయి. ఇది 2023లో నమోదైన 32 శాతం తిరస్కరణ రేటుతో పోలిస్తే రెండింతలకు పైగా పెరుగుదలగా నిలిచింది. అదే సమయంలో చైనా విద్యార్థుల వీసా తిరస్కరణ రేటు కేవలం 24 శాతం, ఇతర దేశాల సగటు రేటు 40 శాతం మాత్రమేగా నమోదైందని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Details

దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు సమచారాం

అంతర్జాతీయ విద్యార్థి వీసా విధానాన్ని కఠినతరం చేయాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ భారీ తిరస్కరణలు చోటుచేసుకున్నాయి. దీనితో పాటు భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా తర్వాత అత్యధిక విదేశీ విద్యార్థులను ఆతిథ్యం ఇస్తున్న దేశం కెనడా కాగా, గతేడాది సుమారు 10 లక్షల విదేశీ విద్యార్థులు అక్కడ చదువుకునే అవకాశం పొందారు. వీరిలో 41 శాతం భారత్‌ విద్యార్థులే ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో చైనా, వియత్నాం విద్యార్థులు ఉన్నారు. కెనడాలో విద్యార్థి వీసాల భారీ తిరస్కరణకు ప్రధాన కారణాలు స్థానిక పరిస్థితులేనని ఇమిగ్రేషన్‌ నిపుణులు చెబుతున్నారు.

Details

మరింత జాగ్రత్తలు తీసుకుంటున్న కెనడా ప్రభుత్వం

గృహ వసతి కొరత, మౌలిక సదుపాయాల కొరత, జీవన వ్యయాలు పెరగడం వంటి అంశాల వల్ల విదేశీ విద్యార్థులను అంగీకరించడంపై కెనడా ప్రభుత్వం మరింత జాగ్రత్తపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో, కెనడా-అమెరికాలపై ఆధారపడుతున్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు ప్రత్యామ్నాయ గమ్యంగా జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నారని మరో నివేదిక వెల్లడించింది. జర్మనీలో ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండటం, ఉన్నత ప్రమాణాల విద్య, స్థిరమైన నివాస అవకాశాలు వంటి అంశాలు అక్కడి వైపు ఆకర్షణగా మారుతున్నాయి.