LOADING...
Canada: కెనడా స్కూల్‌ షూటింగ్‌ కలకలం.. షూటర్ మానసిక రోగి, ట్రాన్స్ జెండర్
కెనడా స్కూల్‌ షూటింగ్‌ కలకలం.. షూటర్ మానసిక రోగి, ట్రాన్స్ జెండర్

Canada: కెనడా స్కూల్‌ షూటింగ్‌ కలకలం.. షూటర్ మానసిక రోగి, ట్రాన్స్ జెండర్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా దేశంలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో ఉన్న పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఈ దారుణానికి కారణమైనది ఓ ట్రాన్స్‌జెండర్‌ యువతి అని అధికారులు నిర్ధారించారు. ఆమె పేరు జెస్సీవాన్‌ రూల్‌ సెలార్‌ (18)గా గుర్తించారు. జెస్సీ మానసిక సమస్యలతో బాధపడుతోందని పోలీసులు వెల్లడించారు. టంబ్లర్‌ రిడ్జ్‌ సెకండరీ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో నిందితురాలితో పాటు మొత్తం 10 మంది మృతి చెందినట్లు కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ కమాండర్‌ తెలిపారు. జెస్సీ ఇదే పాఠశాలలో గతంలో చదువుకున్న మాజీ విద్యార్థినేనని చెప్పారు. ఈ ఘటనను ఆమె ఒంటరిగానే నిర్వహించిందని, దీనికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

వివరాలు 

ముందుగా కుటుంబసభ్యులను చంపి..!

మానసిక అనారోగ్య సమస్యల కారణంగా ఆమెకు చికిత్స అందించాల్సిన విషయమై స్థానిక పోలీసులు గతంలో పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లినట్టు వెల్లడించారు. ఇంతకుముందు ఆమె నివాసం నుంచి పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారని, చట్టపరమైన ప్రక్రియలు పూర్తైన అనంతరం వాటిని తిరిగి అప్పగించినట్టు తెలిపారు. జెస్సీ వద్ద తుపాకీ లైసెన్స్‌ ఉన్నప్పటికీ, అది గత ఏడాదితోనే గడువు ముగిసిందని అధికారులు వివరించారు. ఘటనకు ముందు ఆమె తన ఇంట్లోనే కుటుంబ సభ్యులపై కాల్పులకు పాల్పడినట్టు చెప్పారు. ఈ దాడిలో ఆమె తల్లి, 11 ఏళ్ల సవతి సోదరుడు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. అనంతరం ఆమె పాఠశాల వద్దకు వెళ్లి ఈ ఘాతకానికి పాల్పడినట్టు సమాచారం.

వివరాలు 

కాల్పుల ఘటనపై ప్రధాని స్పందన

ఈ కాల్పుల ఘటనను కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన మీడియాతో చెప్పారు. ఈ నేపథ్యంలో తన విదేశీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. ఘటనలో మరణించిన వారికి కెనడా పార్లమెంటు సంతాపం ప్రకటించింది.

Advertisement