
Canada Shot : కెనడాలో వ్యాపారి ఇంటిపై కాల్పుల మోత.. భయాందోళనలో హిందూ కుటుంబాలు
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని ఓ హిందూ వ్యాపారి ఇంటిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే (Surrey)లో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన జరిగింది.
సుర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్ అధ్యక్షుడైన సతీశ్ కుమార్ పెద్ద కుమారుడే లక్ష్యంగా దుండగులు ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు.
ఆ ఇంటిపై సుమారు 14 రౌండ్ల కాల్పులు జరిపారని సుర్రే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
ఇల్లు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పోలీసులు వివరించారు. సమాచారం అందుకున్న సుర్రే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
DETAILS
ఆ దేశంలో హిందూ వర్గాలకు భద్రత ఏదీ
ఈ మధ్య కాలంలో కెనడాలోని హిందూ వర్గాలే లక్ష్యంగా దాడులు ఎక్కువగా చోటు చేసుకుంటుండటం కలవరపెట్టే అంశంగా మారుతోంది.
కెనడాలోని పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలను సైతం కొందరు దుండగలు టార్గెట్ చేస్తున్నారు. పలు చోట్ల ఆలయాలను ధ్వంసం చేసిన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటం గమనార్హం.
ఈ దాడుల వెనుక ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి ఘటనలతో స్థానికంగా ఉంటున్న హిందువు కుటుంబాలు తీవ్రంగా కలవరానికి గురవుతున్నారు.
ఇప్పటికైనా కెనడా ప్రభుత్వం హిందూ వర్గాల భద్రతా కోసం మెరుగైన చర్యలు తీసుకుని పటిష్ట బందోబస్తు అందించాలని కోరుతున్నారు.