LOADING...
Carney: ఎన్నికల జోక్యం ఆరోపణలకు ఫుల్‌స్టాప్.. భారత్‌కు కెనడా క్లారిటీ

Carney: ఎన్నికల జోక్యం ఆరోపణలకు ఫుల్‌స్టాప్.. భారత్‌కు కెనడా క్లారిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

జస్టిన్ ట్రూడో(Justin Trudeau) పాలన సమయంలో పలు ఉద్రిక్తతలకు గురైన భారత్-కెనడా సంబంధాలు ఇప్పుడు మళ్లీ సవ్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Mark Carney) భారత్‌తో సానుకూల సంబంధాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం భారత్ పర్యటనకు రానున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ ప్రభుత్వంపై గతంలో చేసిన ఆరోపణలను కెనడా అధికారులు ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు.

వివరాలు 

ఇంతకీ ఏం జరిగిందంటే..?

సుమారు రెండేళ్ల క్రితం కెనడాలో జరిగిన ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. దీంతో అప్పటి ట్రూడో ప్రభుత్వం ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఒక స్వతంత్ర కమిషన్‌ను నియమించింది. ఆ దర్యాప్తు ప్రక్రియలో భారత్ పేరు కూడా ప్రస్తావనలోకి రావడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఆరోపణలను భారత్ స్పష్టంగా ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది. అనంతరం జరిగిన విచారణలో కెనడా రాజకీయాల్లో భారత్ ఎలాంటి జోక్యం చేసుకుందని నిర్ధారించే ఆధారాలు లభించలేదని వెల్లడైంది.

వివరాలు 

విదేశీ జోక్యం ఆరోపణలపై మళ్లీ క్లారిటీ.. భారత్‌కు క్లీన్ చిట్

ముఖ్యంగా 2021 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా న్యూఢిల్లీ ప్రయత్నాలు చేసినట్లు ఎలాంటి సమాచారం తమకు అందలేదని ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న ఓ సీనియర్ అధికారి కమిషన్‌కు స్పష్టం చేశారు. ఇప్పుడీ ఎన్నికల జోక్యం అంశంపైనే కార్నీ ప్రభుత్వం మరొకసారి స్పష్టత ఇచ్చింది. తమ దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుందనే నమ్మకం తమకు లేదని కెనడా అధికారులు తెలిపారు. ఒకవేళ అలాంటి నమ్మకం ఉంటే తమ ప్రధాని భారత్ పర్యటనకు వెళ్లే పరిస్థితి ఉండేదే కాదని పేర్కొన్నారు. ఈ అంశాలపై భారత్ ప్రభుత్వంతో సమగ్ర చర్చలు జరిపినట్లు కూడా వెల్లడించారు. విదేశీ జోక్యాన్ని అడ్డుకునేలా తగిన భద్రతా చర్యలు తమ వద్ద అమల్లో ఉన్నాయని సదరు అధికారి మీడియాకు తెలిపారు.

Advertisement