LOADING...
Canada: భారత్‌తో భారీ ట్రేడ్ డీల్‌కు కెనడా ప్రయత్నాలు.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ట్రేడ్ లక్ష్యం

Canada: భారత్‌తో భారీ ట్రేడ్ డీల్‌కు కెనడా ప్రయత్నాలు.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ట్రేడ్ లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరే దిశగా చర్చలు ముందుకు సాగుతున్నాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. భారత్‌తో కుదిరే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కెనడా కార్మికులు, వ్యాపారాలకు ఎంతో మేలు చేస్తుందని, భారీ మార్కెట్ అవకాశాలు తెరుస్తుందని ఆయన పేర్కొన్నారు. కెనడా పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో సమావేశం అనంతరం కార్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధనం, వ్యవసాయ ఆహార రంగం, టెక్నాలజీ, విద్య వంటి కీలక రంగాల్లో రెండు దేశాలకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు ఆయన ఎక్స్‌లో వెల్లడించారు.

వివరాలు 

భారత్-కెనడా సంబంధాల్లో కొత్త మలుపు

ఈ పర్యటనకు భారత్ నుంచి గనులు, ఇంధనం, ఆటోమొబైల్, ఏరోస్పేస్ రంగాలకు చెందిన 100 మందికి పైగా ప్రముఖ వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు. కెనడాకు భారత్ పంపిన అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందం ఇదేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మార్క్ కార్నీతో భేటీ అనంతరం మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో కార్నీ భారత్‌ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను పూర్తిగా మార్చేసిందన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత కెనడా ప్రధాని భారత్‌కు రావడం కీలక మలుపు అని పేర్కొన్నారు. "భారత్-కెనడా భాగస్వామ్యం చాలా వేగంగా కొత్త దిశగా వెళ్తోంది. రెండు దేశాల సంబంధాలకు కొత్త లక్ష్యాలు, కొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి" అని గోయల్ చెప్పారు.

వివరాలు 

2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ట్రేడ్ లక్ష్యం

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలను కూడా కార్నీకి గోయల్ తెలియజేశారు. భారత్ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య విశ్వాసం మరింత పెరిగిందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఒట్టావాలో కార్నీతో పాటు కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్‌తో కూడా గోయల్ సమావేశమయ్యారు. అలాగే ప్రముఖ కంపెనీలు, స్టార్టప్‌లు, పెన్షన్ ఫండ్ల సీఈఓలతో సమావేశాలు నిర్వహించనున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు గోయల్ తెలిపారు.

Advertisement

వివరాలు 

మళ్లీ మొదలైన భారత్-కెనడా వాణిజ్య చర్చలు

భారత్-కెనడా మధ్య వాణిజ్య చర్చలు 2010 నుంచే కొనసాగుతున్నాయి. అయితే 2023లో కెనడాలో ఖలిస్తాన్ అనుచరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపణలు చేయడంతో చర్చలు నిలిచిపోయాయి. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని భారత్ విమర్శించింది. మార్క్ కార్నీ ప్రధాని అయిన తర్వాత రెండు దేశాల సంబంధాలు మళ్లీ మెరుగుపడ్డాయి.

Advertisement

వివరాలు 

యురేనియం సరఫరా ఒప్పందం

ఇటీవల భారత్ పర్యటనలో కార్నీ, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. అందులో భాగంగా అణు విద్యుత్ ఉత్పత్తి కోసం భారత్‌కు సుమారు 2.6 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కూడా ఉంది. ఈ నెల ప్రారంభంలో కెనడా ప్రతినిధి బృందం ఢిల్లీలో వాణిజ్య చర్చలు జరిపింది. మరో భారత ప్రతినిధి బృందం ఈ ఏడాదిలోనే మళ్లీ కెనడా వెళ్లి చర్చలు కొనసాగించనుంది.

Advertisement