Manitoba: కెనడా పర్మినెంట్ రెసిడెంట్ కలలకు బ్రేక్.. భారతీయ విద్యార్థులకు మానిటోబా భారీ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వీసా ఆంక్షలతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న భారతీయ విద్యార్థులకు మరో భారీ షాక్ తగిలింది. కెనడాలో చదువుకుని అక్కడే శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్సీ-పీఆర్) పొందాలని ఆశపడుతున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల కలలకు మానిటోబా ప్రావిన్స్ ప్రభుత్వం గట్టి బ్రేక్ వేసింది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉన్న కీలక ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ఒక్కసారిగా మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
వివరాలు
ఈ విధానాన్ని రద్దు చేసిన తొలి కెనడియన్ ప్రావిన్స్‌గా మానిటోబా
కెనడాలోని మానిటోబా ప్రావిన్స్, మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (MPNP) పరిధిలోని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్‌కు చెందిన కెరీర్ ఎంప్లాయ్‌మెంట్ పాత్‌వే (CEP)ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు జూన్ 11న ప్రకటించింది. చదువు పూర్తయ్యాక నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించిన ఈ విధానాన్ని రద్దు చేసిన తొలి కెనడియన్ ప్రావిన్స్‌గా మానిటోబా నిలిచింది. దీంతో స్టూడెంట్ వీసా ద్వారా కెనడాలో స్థిరపడాలని భావిస్తున్న భారతీయులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
2021 నాటికి మానిటోబాలో 5,240 మంది భారతీయ స్టడీ పర్మిట్ హోల్డర్లు
విస్తీర్ణం పరంగా కెనడాలో ఆరో అతిపెద్ద ప్రావిన్స్ అయిన మానిటోబా, ఇటీవలి కాలంలో విదేశీ విద్యార్థులకు ప్రముఖ గమ్యస్థానంగా మారింది. దీని రాజధాని విన్నిపెగ్‌లో టొరంటో, ఒట్టావా వంటి నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉండటంతో పాటు, యూనివర్శిటీ ఆఫ్ మానిటోబా, ఆర్‌ఆర్‌సీ పాలిటెక్ వంటి ప్రభుత్వ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. దీనికి తోడు త్వరగా పీఆర్ లభిస్తుందనే నమ్మకంతో తెలుగువారితో పాటు 80కి పైగా దేశాలకు చెందిన దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. వీరిలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది. 2021 నాటికి మానిటోబాలో 5,240 మంది భారతీయ స్టడీ పర్మిట్ హోల్డర్లు ఉన్నారు.
వివరాలు
కెనడాలో శాశ్వత నివాస హోదా
ఇప్పటి వరకు అమల్లో ఉన్న MPNP నిబంధనల ప్రకారం, మానిటోబాలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలో కనీసం ఏడాది పాటు చదివి, కోర్సు పూర్తయ్యాక తమ విద్యార్హతకు అనుగుణంగా ఉద్యోగ ఆఫర్ పొందితే నేరుగా పీఆర్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ముఖ్యంగా భారతదేశం నుంచి వెళ్లి వన్ ఇయర్ పీజీ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కెనడాలో శాశ్వత నివాస హోదా పొందేవారు. ఇప్పుడు ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయడంతో భారతీయ విద్యార్థులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
వివరాలు
మానిటోబాలో కొత్తగా శాశ్వత నివాస హోదా పొందిన వారిలో 5,485 మంది భారతీయులు
తాజా గణాంకాల ప్రకారం,మానిటోబాలో కొత్తగా శాశ్వత నివాస హోదా పొందిన వారిలో 5,485 మంది భారతీయులు ఉన్నారు. ఇది మొత్తం ప్రవేశాల్లో 33.1 శాతం.CEP కార్యక్రమం రద్దుతో భవిష్యత్తులో భారతీయ విద్యార్థులు విద్యార్హతల ఆధారంగా కాకుండా,ఉద్యోగ అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చే ఇతర మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. రద్దు చేసిన CEP విధానం ప్రకారం,దరఖాస్తుదారులు గత మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరం పాటు మానిటోబాలో పూర్తికాల విద్యను అభ్యసించి ఉండాలి. అలాగే కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్‌మార్క్(CLB)లో కనీసం 7స్థాయి భాషా ప్రావీణ్యం కలిగి ఉండాలి. ప్రావిన్స్‌లో తమ భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను వివరిస్తూ కెరీర్ ఎంప్లాయ్‌మెంట్ ప్లాన్ సమర్పించాల్సి ఉండేది. కొన్ని సందర్భాల్లో తగిన ఆర్థిక వనరులు ఉన్నట్లు కూడా నిరూపించాల్సి వచ్చేది.
వివరాలు
ఉద్యోగ అనుభవానికే అధిక ప్రాధాన్యత
అయితే కొత్త నిబంధనల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 'స్కిల్డ్ వర్కర్ ఇన్ మానిటోబా' ప్రోగ్రామ్‌లో ఉద్యోగ అనుభవానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు అర్హత కలిగిన పూర్తికాల,దీర్ఘకాలిక ఉద్యోగ ఆఫర్ పొందే ముందు అదే మానిటోబా యజమాని వద్ద కనీసం ఆరు నెలల పాటు నిరంతర పూర్తికాల ఉద్యోగం చేసి ఉండాలి. ఆ పని అనుభవానికి సంబంధించిన ఆధారాలు సమర్పించిన తర్వాతే పీఆర్ నామినేషన్‌కు అర్హత లభిస్తుంది.
వివరాలు
కెనడాలో పీఆర్ పొందాలనుకునే విద్యార్థులు ఇకపై అదనపు ఉద్యోగ అనుభవం సంపాదించాలి
ఈ విధానంలో ప్రత్యేక విద్యార్హత తప్పనిసరి కాకపోయినా, భాషా ప్రావీణ్యం మాత్రం ఉద్యోగ అవసరాలు, దరఖాస్తుదారుడు మానిటోబాలో ఆర్థికంగా స్థిరపడగల సామర్థ్యాన్ని బట్టి నిర్ణయిస్తారు. అదనంగా సెటిల్‌మెంట్ ప్లాన్ సమర్పించడం కూడా తప్పనిసరి చేశారు. గతంలో ఈ నిబంధన లేదు. అంతేకాకుండా స్వయం ఉపాధి ద్వారా పొందిన ఉద్యోగ అనుభవాన్ని లేదా పూర్తికాలం చదువుతున్న సమయంలో చేసిన పనిని పరిగణనలోకి తీసుకోరు. దీంతో కేవలం చదువుతోనే కెనడాలో పీఆర్ పొందాలనుకునే విద్యార్థులు ఇకపై అదనపు ఉద్యోగ అనుభవం సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.