Karoline Leavitt: వైట్‌హౌస్‌కు గుడ్‌బై చెప్పనున్న కరోలిన్ లీవిట్.. కారణం ఏమిటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కరోలిన్ లీవిట్.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా అమెరికా ప్రభుత్వ నిర్ణయాలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనల వివరాలను మీడియాకు నిరంతరం తెలియజేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఇది తన చివరి బ్రీఫింగ్ అని ప్రకటించడం ద్వారా ఆమె తాత్కాలికంగా బాధ్యతలకు దూరమవుతున్నట్లు స్పష్టమైంది. ప్రసూతి సెలవుపై వెళ్లనున్నట్లు కరోలిన్ లీవిట్ వెల్లడించారు. తాను త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని, ఏ క్షణమైనా ప్రసవం కావొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు వైట్‌హౌస్ విధులకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. అయితే తన స్థానంలో ఎవరు ప్రెస్ బ్రీఫింగ్‌లు నిర్వహిస్తారన్న విషయంపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. వైట్‌హౌస్ బృందం సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తుందని మాత్రమే పేర్కొన్నారు.
వివరాలు
అధికారికంగా ఎవరిని నియమించలేదు
ఇదిలా ఉండగా ఆమె స్థానంలో ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ వంటి సీనియర్ నేతలు తాత్కాలికంగా ప్రెస్‌మీట్‌లు నిర్వహించే అవకాశముందని సమాచారం. కేవలం 28 ఏళ్ల వయసులోనే ఈ కీలక పదవిని చేపట్టి, అతి పిన్న వయస్కురాలిగా కరోలిన్ లీవిట్ గుర్తింపు పొందారు. రిపబ్లికన్ ప్రభుత్వ తరఫున మీడియాకు గట్టి సమాధానాలు ఇవ్వడంలో ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇప్పటికే 2024జూలైలో ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చారు. తొలి బిడ్డ జననం తర్వాత కొద్దిరోజుల్లోనే తిరిగి విధుల్లో చేరడం విశేషం. ఆమె భర్త నికోలస్ రిచ్చియో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని వైట్‌హౌస్ అధికారికంగా నియమించలేదు. అలాగే ఆమె సెలవు వ్యవధి ఎంతకాలం కొనసాగుతుందన్నదానిపై కూడా స్పష్టత లేదు.