LOADING...
El Niño: ఎల్‌నినో దెబ్బ.. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు ఎడారిగా మారే ప్రమాదం!
ఎల్‌నినో దెబ్బ.. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు ఎడారిగా మారే ప్రమాదం!

El Niño: ఎల్‌నినో దెబ్బ.. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు ఎడారిగా మారే ప్రమాదం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచం ప్రస్తుతం యుద్ధాలు,ఆర్థిక సంక్షోభాలు వంటి పరిణామాలపై దృష్టి సారించినప్పటికీ.. మరోవైపు ప్రకృతి నిశ్శబ్దంగా మరింత పెద్ద ముప్పును సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుగా గుర్తింపు పొందిన క్యాస్పియన్ సముద్రం వేగంగా కుంచించుకుపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాదాపు 3.75లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన ఈ మహా జలాశయం,వచ్చే కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా ఎండిపోయే ప్రమాదంలో ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న క్యాస్పియన్ సముద్రానికి ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం మరింత సమస్యగా మారింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో కారణంగా మధ్య ఆసియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

వివరాలు 

2050 నాటికి ఇప్పటి రూపురేఖలను కోల్పోయే అవకాశం 

దీంతో సముద్రంలోని నీరు వేగంగా ఆవిరవుతోంది. మరోవైపు వర్షపాతం తగ్గిపోవడంతో క్యాస్పియన్‌కు నీటిని అందించే ప్రధాన నదుల నుంచి వచ్చే ప్రవాహం కూడా గణనీయంగా తగ్గుతోంది. రష్యా, కజకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, అజర్‌బైజాన్, ఇరాన్ దేశాల మధ్య విస్తరించిన ఈ జలాశయం 2050 నాటికి ఇప్పటి రూపురేఖలను కోల్పోయే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉత్తర భాగం పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

వివరాలు 

సముద్రాన్ని తలపించే మహా సరస్సు

క్యాస్పియన్ సముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్గత జలాశయం. ఇది సముద్రంలా విస్తరించి ఉన్నప్పటికీ,ఇతర సముద్రాలతో సహజ అనుసంధానం లేకపోవడంతో సాంకేతికంగా సరస్సుగా పరిగణిస్తారు. 2020లో జర్మనీలోని బ్రెమెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్‌లోని ఉట్రెచ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 'నేచర్' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఈ శతాబ్దం ముగిసే నాటికి క్యాస్పియన్ సముద్రం నీటిమట్టం 9 నుంచి 18 మీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంది. నీటిమట్టం 9 మీటర్లు తగ్గితే సముద్ర ఉపరితలంలో సుమారు 23 శాతం భాగం శాశ్వతంగా ఎండిపోతుంది. అదే 18 మీటర్ల మేర తగ్గితే దాదాపు 34 శాతం ప్రాంతం భూమిగా మారే ప్రమాదం ఉంది.

Advertisement

వివరాలు 

ముందుగా ఉత్తర భాగమే ఎందుకు ఎండిపోతోంది?

పరిస్థితులు మరింత విషమిస్తే ఆ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది దాదాపు పోర్చుగల్ దేశ పరిమాణంతో సమానమైన విస్తీర్ణం. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. 2050 నాటికే క్యాస్పియన్ సముద్రంలోని ఉత్తర భాగం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. క్యాస్పియన్ సముద్రం ఉత్తర, మధ్య, దక్షిణ బేసిన్లుగా విభజించబడింది. దక్షిణ బేసిన్ దాదాపు ఒక కిలోమీటరు లోతుతో అత్యంత లోతైన ప్రాంతం కాగా, మధ్య బేసిన్ సుమారు 788 మీటర్ల లోతు కలిగి ఉంది.

Advertisement

వివరాలు 

ముందుగా ఉత్తర భాగమే ఎందుకు ఎండిపోతోంది?

అయితే రష్యా-కజకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఉత్తర బేసిన్ సగటు లోతు కేవలం 5 మీటర్లు మాత్రమే. మొత్తం వైశాల్యంలో దాదాపు మూడో వంతు ఈ ప్రాంతమే అయినప్పటికీ, క్యాస్పియన్ సముద్రంలోని మొత్తం నీటిలో కేవలం 1 శాతం మాత్రమే ఇక్కడ ఉంటుంది. అందుకే నీటిమట్టం తగ్గుదల ప్రభావం మొదటగా ఉత్తర భాగంపైనే పడుతోంది. గత శతాబ్దంలో సోవియట్ పాలకుల నీటి నిర్వహణలో జరిగిన తప్పిదాల కారణంగా ఆరల్ సముద్రం పూర్తిగా ఎండిపోయిన ఘటనను గుర్తుచేస్తూ.. క్యాస్పియన్ సముద్రం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

క్యాస్పియన్ సముద్రం ఎందుకు ఎండిపోతోంది?

ఈ పరిస్థితికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మొదటిది.. క్యాస్పియన్ సముద్రానికి నీటిని అందించే 130నదుల్లో అత్యంత కీలకమైన ఓల్గా నది. ఈ ఒక్క నది నుంచే మొత్తం నీటి ప్రవాహంలో సుమారు 80శాతం చేరుతుంది. అయితే 2026లో అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం.. గత కొన్నేళ్లలో ఓల్గా నది ద్వారా వచ్చే నీటి ప్రవాహం దాదాపు 12శాతం తగ్గింది. వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. రెండో కారణం గ్లోబల్ వార్మింగ్. 1979 నుంచి 2015 మధ్య కాలంలో ఈ ప్రాంత సగటు ఉష్ణోగ్రత సుమారు 1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది.

వివరాలు 

జీవవైవిధ్యం,ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

దీంతో నీరు ఆవిరయ్యే వేగం గణనీయంగా పెరిగింది. క్యాస్పియన్ సముద్రం కోల్పోయిన మొత్తం నీటిలో దాదాపు 40 శాతం కేవలం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆవిరైందని పరిశోధనలు వెల్లడించాయి. క్యాస్పియన్ సముద్రం కుంచించుకుపోవడం వల్ల జీవవైవిధ్యానికి కూడా పెద్ద ముప్పు ఏర్పడుతోంది. ప్రపంచంలో అత్యంత అరుదైన జీవుల్లో ఒకటైన క్యాస్పియన్ సీల్స్ చలికాలంలో ఉత్తర ప్రాంతంలో ఏర్పడే మంచుపైనే పిల్లలకు జన్మనిస్తాయి. మంచు విస్తీర్ణం తగ్గిపోతే ఈ అరుదైన జాతి మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా ఈ ప్రాంతానికి భారీ నష్టం వాటిల్లే అవకాశముంది.

వివరాలు 

క్యాస్పియన్ ప్రాంతం చమురు నిల్వలు, సహజ వాయువు నిల్వలు 

ప్రపంచ చమురు నిల్వల్లో సుమారు 3 శాతం, సహజ వాయువు నిల్వల్లో దాదాపు 4 శాతం క్యాస్పియన్ ప్రాంతంలోనే ఉన్నాయి. కజకిస్తాన్‌లోని అతిపెద్ద కాశగన్ ఆయిల్ ఫీల్డ్ ఉత్తర బేసిన్‌లో ఉండటంతో నీటిమట్టం తగ్గితే అక్కడి చమురు కార్యకలాపాలు, నౌకాశ్రయ మౌలిక వసతులు తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. అదే విధంగా రష్యాలోని ఆస్ట్రాఖాన్, అజర్‌బైజాన్ రాజధాని బాకూ వంటి కీలక ఓడరేవులు ప్రస్తుతం ఉన్న తీరానికి దూరంగా మారే అవకాశం ఉంది. చైనా నుంచి ఐరోపాకు వెళ్లే అత్యంత కీలకమైన 'మిడిల్ కారిడార్' వాణిజ్య మార్గం కూడా ఈ పరిణామాల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

క్యాస్పియన్ ప్రాంతం చమురు నిల్వలు, సహజ వాయువు నిల్వలు

ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుగా పేరొందిన క్యాస్పియన్ సముద్రం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి.. వాతావరణ మార్పుల తీవ్రతను మరోసారి ప్రపంచానికి గుర్తుచేస్తోంది. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడంలో ప్రపంచ దేశాలు సమిష్టిగా చర్యలు తీసుకోకపోతే, ఈ మహా జలాశయం భవిష్యత్తులో మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

Advertisement