Loading...
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. డ్రగ్స్‌ మత్తులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య
బంగ్లాదేశ్‌లో దారుణం.. డ్రగ్స్‌ మత్తులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. డ్రగ్స్‌ మత్తులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పుర్‌ నగరంలో మాదకద్రవ్యాల మత్తులో దుండగులు ఓ కుటుంబంలోని నలుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తమ ఇంటి మేడపైకి వచ్చి డ్రగ్స్‌ తీసుకుంటూ పెద్దగా మాట్లాడుతున్న ఇద్దరిని ప్రశ్నించడమే ఆ కుటుంబం చేసిన తప్పుగా మారింది. అప్పటికే మత్తులో ఉన్న వారు ఆగ్రహంతో కుటుంబ సభ్యులను ఒకరి తర్వాత ఒకరిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మృతులను గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతీలత చక్రవర్తి (50), కుమార్తె ఆగామీ చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియం చక్రవర్తి (12)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్ధో, సిద్ధార్థ అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

'యాబా' అనే మాదకద్రవ్యాన్ని సేవించిన అనుమానితులు

గణపతి చక్రవర్తి ఓ హిందూ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పక్కనే ఉన్న మేడ నుంచి ఇద్దరు వ్యక్తులు చక్రవర్తి ఇంటి మేడపైకి వచ్చారు.

అక్కడ కూర్చొని 'యాబా' అనే మాదకద్రవ్యాన్ని సేవించారు. ఆ సమయంలో డ్రగ్స్‌ తీసుకుంటూ పెద్దగా మాట్లాడుతున్న వారిని చక్రవర్తి ప్రశ్నించారు.

తమ డ్రగ్స్‌ వినియోగం బయటపడుతుందనే భయంతో ఆగ్రహించిన అనుమానితులు.. చక్రవర్తి మెడలో ఉన్న తువాలును బిగించి ఉరిలా చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆయన కేకలు విని మేడపైకి వస్తున్న భార్య ప్రీతీలతను కూడా అదే విధంగా చంపినట్లు తెలిపారు. అనంతరం వారి ఇద్దరు పిల్లలను సైతం దుండగులు వదిలిపెట్టలేదని పేర్కొన్నారు.

వివరాలు 

మాదకద్రవ్యాల సేవనను ప్రశ్నించడమే ఈ దారుణ హత్యలకు కారణం

గురువారం ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో విషయం వెంటనే వెలుగులోకి రాలేదు.

శుక్రవారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి కుటుంబంలోని నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ కుటుంబానికి ఎవరితోనూ ఎలాంటి వివాదాలు లేదా శత్రుత్వం ఉన్నట్లు తమ దర్యాప్తులో ఇప్పటివరకు గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు.

మాదకద్రవ్యాల సేవనను ప్రశ్నించడమే ఈ దారుణ హత్యలకు కారణంగా అనుమానిస్తున్న పోలీసులు.. ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.

ADVERTISEMENT