SeaMines in Hormuz: హర్మూజ్‌లో సీమైన్స్ పూర్తిగా తొలగించాం.. అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను మరోసారి చాటిచెప్పేలా అమెరికా కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుంది. అంతర్జాతీయ నౌకా రాకపోకలకు ఉపయోగించే మార్గాల్లో సముద్రపు మందుపాతరలు (Sea Mines) ఏర్పాటు చేసింది. దీంతో ఇరాన్ సూచించిన మార్గాల్లో కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించిన కొన్ని నౌకలు సీమైన్స్‌ను ఢీకొని పేలిపోయాయి. నౌకాయానానికి తీవ్ర అడ్డంకిగా మారిన ఈ సీమైన్స్‌ను పూర్తిగా తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తాజాగా ప్రకటించింది. ఈ తొలగింపు ప్రక్రియను అత్యంత రహస్యంగా చేపట్టినట్లు వెల్లడించింది. దీంతో హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు మరింత సురక్షితంగా సాగేందుకు అవకాశం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వివరాలు
ఆపరేషన్ అంత సులభం కాదు..
హర్మూజ్‌లో సముద్రపు మందుపాతరలను గుర్తించి తొలగించడం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌గా చెప్పొచ్చు.
విశాలమైన సముద్రంలో చిన్న వస్తువును వెతకడంతో సమానంగా ఈ ప్రక్రియ ఉంటుంది.
సీమైన్స్ ఎక్కడ అమర్చారో గుర్తించడం, వాటిని నిర్వీర్యం చేయడం ఎంతో ప్రమాదకరమైన పని.
ఈ కారణంగానే వీటి తొలగింపును అమెరికా ప్రత్యేక ప్రణాళికతో చేపట్టింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సీమైన్స్‌ను తొలగిస్తామని చాలాకాలంగా స్పష్టం చేస్తూ వస్తున్నారు.
కొన్ని నెలల క్రితం ఈ ఆపరేషన్ కోసం అమెరికా రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను రంగంలోకి దించింది.
యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్, యూఎస్‌ఎస్ మైఖేల్ మర్ఫీ నౌకలను ఈ కార్యకలాపాల్లో వినియోగించింది.
వీటికి సహకరించేందుకు ఎంకే-18, మాడ్-2 కింగ్‌ఫిష్ వంటి మానవరహిత పరికరాలను కూడా ఉపయోగిస్తోంది.
వివరాలు
వివిధ రకాల సీమైన్స్..
సముద్రంలో ఉపయోగించే సీమైన్స్ అన్నీ ఒకే విధంగా పనిచేయవు.
నౌకలు నీటిలో కదులుతున్నప్పుడు ఏర్పడే పీడనం,తరంగాల శబ్దం,నౌకల నుంచి వెలువడే విద్యుత్ శక్తి వంటి అంశాలను గుర్తించి పేలే విధంగా కొన్ని మైన్స్ రూపొందిస్తారు.
అంటే నౌక వాటికి దగ్గరగా వెళ్లినప్పుడు దాని కదలికలను గుర్తించి పేలే అవకాశం ఉంటుంది.
మరికొన్ని సీమైన్స్‌ను లేజర్ లేదా రాడార్ సాయంతో గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది.
ఒకవేళ వాటి ఉనికిని గుర్తించినా..వాటిని సురక్షితంగా పేల్చి నిర్వీర్యం చేయడం అంత సులభం కాదు.
అందుకే హర్మూజ్‌లో ఇలాంటి మందుపాతరలను తొలగించినట్లు అమెరికా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతర్జాతీయ నౌకా రవాణాకు కీలకమైన ఈ జలమార్గంలో భద్రతపై నెలకొన్న ఆందోళనలను ఈ ప్రకటన కొంతమేర తగ్గించే అవకాశముంది.