Urea: చైనా ఎగుమతుల నియంత్రణలు.. ప్రపంచంలో యూరియా కొరత భయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో ప్రపంచంలో ప్రధాన ఎరువుల ఎగుమతిదారుల్లో ఒకటైన చైనా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా జెట్ ఇంధనం, డీజిల్‌తో పాటు ఎరువుల ఎగుమతులపై నియంత్రణలు విధించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్‌లో యూరియా కొరత తలెత్తే అవకాశంపై వ్యవసాయాధారిత దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వివరాలు
ఎగుమతులపై చైనా కఠిన నిర్ణయాలు
అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం సమాచారం ప్రకారం, జెట్ ఇంధనం, డీజిల్, కిరోసిన్‌ల ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణల కమిషన్ (NDRC) దేశీయ పరిశ్రమలకు సూచనలు ఇచ్చింది. అలాగే మార్చి మధ్య నుంచే నైట్రోజన్, పొటాషియం ఆధారిత ఎరువుల మిశ్రమాలపై నియంత్రణలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూరియా ఎగుమతులను నిలిపివేసిన బీజింగ్ ప్రభుత్వం, అమ్మోనియా సల్ఫేట్ ఎగుమతికి మాత్రం అనుమతిని కొనసాగిస్తోంది. దేశీయ అవసరాలను తీర్చుకోవడం, ఇంధన-ఆహార నిల్వలను రక్షించుకోవడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.
వివరాలు
భారత్‌కు ఎగుమతులపై సందేహాలు
ఈ నిర్ణయాలపై చైనా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఎరువుల తయారీ సంస్థకు భారత్‌కు ఎగుమతులను నిలిపివేయాలని ప్రభుత్వ ఆదేశాలు అందినట్లు అక్కడి ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, వియత్నాం, భారత్ వంటి దేశాలు చైనా నుంచి ఎరువులను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది.
వివరాలు
యూరియా ధరల పెరుగుదల భయం
చైనా నుంచి సరఫరా ఆగిపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వ్యవసాయ ఆధారిత దేశాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా యూరియా తయారికి అవసరమైన ద్రవరూప సహజ వాయువు (LNG) సరఫరా లోపంతో భారత్‌లోని పలు ఎరువుల కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి.