China defence budget: భారీగా పెరిగిన చైనా రక్షణ బడ్జెట్.. భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ
ఈ వార్తాకథనం ఏంటి
China defence budget: చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. ఈ సంవత్సరం చైనా తన రక్షణ బడ్జెట్‌ను గత ఐదేళ్లలో అత్యధికంగా 7.2 శాతం పెంచింది.
ఈ పెంపుతో ఈ ఏడాది చైనా రక్షణ బడ్జెట్ 1.67ట్రిలియన్ యువాన్లకు (231 బిలియన్ డాలర్లు) చేరుకున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్‌లో అత్యధికంగా ఖర్చు చేస్తున్న రెండో దేశం చైనా.
చాలా కాలంగా సరిహద్దులో భారత్-చైనాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుండగా, ఇరు దేశాల సైనికులు పలుమార్లు ముఖాముఖి తలపడ్డారు.
ఈ క్రమలో సైన్యాన్ని ఆధునీకరించడంపై దృష్టి సారించింది. ప్రణాళికలో భాగంగానే చైనా ఏడాదికేడాది రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచుకుంటూ పోతోంది.
చైనా
2027నాటికి ఆర్మీని ఆధునీకరించే లక్ష్యంలో చైనా..
2024 సంవత్సరానికి భారతదేశ రక్షణ బడ్జెట్ రూ.6,21,541 కోట్లు (74.8 బిలియన్ డాలర్లు). అయితే 2024కి చైనా బడ్జెట్ సుమారు 232 బిలియన్ డాలర్లు.
అంటే, భారతదేశ రక్షణ బడ్జెట్ కంటే సైన్యంపై చైనా చేస్తున్న ఖర్చు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తన ఆర్మీ పీఎల్ఏని 2027నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందులో భాగంగానే బడ్జెట్‌ను పెంచారు. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్, జపాన్ సహా పలు దేశాలతో చైనాకు వివాదాలు ఉన్నాయి.
అలాగే ఇటు భారత్‌తో సరిహద్దు గొడవలు ఉన్నాయి. అమెరికాతో ఆధిపత్యం పోరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లు.
ఇన్ని వివాదాల నేపథ్యంలో సైన్యాన్ని భారీగా పెంచుకోవాలని చైనా భావిస్తోంది.
చైనా
చైనాకు పెరుగుతున్న సవాళ్లు..
సైనికుల సంఖ్య పరంగా చైనా సైన్యం అతిపెద్దది. అలాగే, చైనా సైన్యంలో రెండు రాకెట్ దళాలు ఉన్నాయి.
ఈ రాకెట్ ఫోర్స్ అణ్వాయుధాల ఆపరేషన్‌ను నిర్వహిస్తుంది.
చైనా తన రాకెట్ బలగాన్ని నిశబ్దంగా విస్తరిస్తోందన్న ఆరోపణలున్నాయి.
చైనా తన సైనిక పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌ను రక్షణ బడ్జెట్‌లో చేర్చలేదు.
ఈ రెండు కలిపితే.. చైనా రక్షణ బడ్జెట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఒకవైపు తన సైనిక బలాన్ని పెంచుకుంటున్న చైనాకు, అదే స్థాయిలో సవాళ్లు కూడా పెరిగాయి.
ఇటీవల,చైనా తన డిఫెన్స్ చీఫ్‌ను ఎటువంటి కారణం చెప్పకుండా పదవి నుంచి తొలగించింది.
చాలామంది టాప్ జనరల్స్ కూడా మార్చింది. దీన్ని బట్టి చూస్తే చైనా సైన్యంలోనూ సమస్యలున్నాయని స్పష్టమవుతోంది.