Loading...
Nepal-Tibet flash flood: జలప్రళయం తర్వాత మరో ముప్పు.. పొంగిపొర్లుతున్న సరస్సుపై నేపాల్ అప్రమత్తం
జలప్రళయం తర్వాత మరో ముప్పు.. పొంగిపొర్లుతున్న సరస్సుపై నేపాల్ అప్రమత్తం

Nepal-Tibet flash flood: జలప్రళయం తర్వాత మరో ముప్పు.. పొంగిపొర్లుతున్న సరస్సుపై నేపాల్ అప్రమత్తం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో వరద ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు సంభవించిన రెండు రోజులకే టిబెట్‌ వైపు ఉన్న ఓ సరస్సు నుంచి నీరు ఉద్ధృతంగా పొంగిపొర్లుతున్నట్లు నేపాల్‌ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరించారు.

వివరాలు 

సహాయక సిబ్బంది, ప్రజలకు అప్రమత్తత సూచనలు

''టిబెట్‌ ప్రాంతంలోని ఓ సరస్సు నుంచి నీరు పొంగిపొర్లుతున్నట్లు సమాచారం అందింది. సహాయక చర్యల్లో ఉన్న బృందాలు, భద్రతా సిబ్బందితో పాటు ప్రజలు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి'' అని నేపాల్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

సరస్సులో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నట్లు రసువా జిల్లా ఉన్నతాధికారి నరేంద్ర పరియార్ తెలిపారు.

ఈ పరిణామంతో స్థానికులు ముందు జాగ్రత్తగా కొండ ప్రాంతాల వైపు తరలివెళ్తున్నట్లు సమాచారం.

వివరాలు 

జలప్రళయం తర్వాత ఏర్పడిన సరస్సు

బుధవారం నేపాల్‌లో సంభవించిన భారీ జలప్రళయానికి హిమానీనదం విరిగిపడటమే కారణమని అధికారులు తెలిపారు.

ఆ ఘటనలో కొట్టుకొచ్చిన భారీ బండరాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలు ఒకచోట పేరుకుపోవడంతో టిబెట్‌ వైపు కొత్తగా ఓ సరస్సు ఏర్పడింది.

ప్రస్తుతం ఈ సరస్సులో నీటి పరిమాణం గణనీయంగా పెరగడంతో అది పొంగిపొర్లుతోంది.

ఈ పరిణామం మరోసారి వరదలకు దారితీసే అవకాశం ఉండటంతో చైనా కూడా అప్రమత్తమైంది.

టిబెట్‌లో మళ్లీ వరద ప్రమాదం పొంచి ఉండటంతో అక్కడ చేపడుతున్న సహాయక చర్యలను చైనా నిలిపివేసింది. పరిస్థితిని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా సమీక్షించారు.

ADVERTISEMENT

వివరాలు 

మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూ.మీ నీరు?

టిబెట్‌ సరిహద్దులోని భోటే కోషి నది ప్రవాహం ప్రారంభమయ్యే ప్రాంతానికి సమీపంలో కొత్తగా సరస్సు ఏర్పడినట్లు చైనా ఇప్పటికే నేపాల్‌ను అప్రమత్తం చేసింది.

గురువారం ఉదయం నాటికి ఆ సరస్సులో దాదాపు 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా వేశారు.

రానున్న మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

నీటి పరిమాణం మరింత పెరిగితే సరస్సు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే ఆందోళన వ్యక్తమైంది.

దీంతో నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అప్రమత్తత కొనసాగుతోంది.

ADVERTISEMENT