LOADING...
China :100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా..!: పెంటగాన్ నివేదిక 
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా..!: పెంటగాన్ నివేదిక

China :100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా..!: పెంటగాన్ నివేదిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అస్త్ర నియంత్రణకు సంబంధించిన చర్చల విషయంలో చైనా స్పందన లేకపోవడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల చైనా మూడు వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండవచ్చని అమెరికా పేర్కొంది. ఇతర అణు శక్తి దేశాలు అనుసరించని విధంగా చైనా ఆయుధాల నిల్వను వేగంగా పెంచుకుంటోందని, అణు,సైనిక మౌలిక సదుపాయాలను అత్యంత వేగంతో అభివృద్ధి చేస్తోందని స్పష్టం చేసింది. ఈ వివరాలతో అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం అయిన పెంటగాన్ ఒక ముసాయిదా నివేదికను విడుదల చేసింది.

వివరాలు 

 2030 నాటికి చైనాకు ఉన్న అణు వార్‌హెడ్‌ల సంఖ్య 1000 దాటే అవకాశం

పెంటగాన్ అంచనాల ప్రకారం, మంగోలియాతో ఉన్న సరిహద్దుకు సమీపంలో మూడు సిలో ఫీల్డ్స్‌లో (విశాలమైన, లోతైన నిర్మాణాలు) సుమారు 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను చైనా మోహరించి ఉండే అవకాశముందని పేర్కొంది. ఈ సిలో కేంద్రాల ఉనికిని గతంలోనే వెల్లడించినప్పటికీ, అప్పట్లో అక్కడ ఏర్పాటు చేసిన క్షిపణుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. 2024 నాటికి చైనాకు ఉన్న అణు వార్‌హెడ్‌ల సంఖ్య 600కు మించదని, అయితే 2030 నాటికి ఈ సంఖ్య 1000 దాటే అవకాశం ఉందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధ నియంత్రణ చర్చలపై చైనా ఎలాంటి ఆసక్తి కనబరచడం లేదని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది.

వివరాలు 

అమెరికా అంచనాలను పూర్తిగా తిరస్కరించిన చైనా 

ఈ నివేదికపై చైనా స్పందిస్తూ అమెరికా అంచనాలను పూర్తిగా తిరస్కరించింది. తమ దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడం కోసం వాషింగ్టన్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని అమెరికాలోని చైనా దౌత్య కార్యాలయం ఆరోపించింది. తమ దేశ భద్రత అవసరాలను దృష్టిలో ఉంచుకొని కనీస స్థాయిలోనే అణు ఆయుధాల మోహరింపును కొనసాగిస్తామని చైనా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, చైనా మరియు రష్యాతో కలిసి అణు నిరాయుధీకరణ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలపై చైనా నుంచి ఎలాంటి ఆసక్తి కనిపించకపోవడంతోనే పెంటగాన్ ఈ నివేదికను విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Advertisement