LOADING...
China: చైనాలో రోబోట్ల ఆధిపత్యం.. రెండు మిలియన్లకు పైగా యంత్రాలు పనిలో..
చైనాలో రోబోట్ల ఆధిపత్యం.. రెండు మిలియన్లకు పైగా యంత్రాలు పనిలో..

China: చైనాలో రోబోట్ల ఆధిపత్యం.. రెండు మిలియన్లకు పైగా యంత్రాలు పనిలో..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచం మొత్తం కంటే ఎక్కువ సంఖ్యలో ఫ్యాక్టరీ రోబోట్లను చైనా ఒంటరిగానే నడుపుతోంది. ప్రస్తుతం అక్కడ రెండు మిలియన్లకు పైగా రోబోట్లు పని చేస్తున్నాయి. ఇవి మిగతా దేశాల్లో కలిపి ఉన్న రోబోట్ల సంఖ్యకంటే ఎక్కువ. అంతర్జాతీయ రోబోటిక్స్ సమాఖ్య ప్రకారం, 2024లో ఒక్క చైనా ఫ్యాక్టరీల్లోనే దాదాపు మూడు లక్షల రోబోట్లను ఇన్‌స్టాల్ చేశారు. అదే సమయంలో అమెరికాలో మాత్రం 34 వేల రోబోలు మాత్రమే ఇన్‌స్టాల్ చేశారు. ఈ వ్యత్యాసం చైనా ఆటోమేషన్‌లో ఎంత ముందుకు దూసుకెళ్లిందో స్పష్టంగా చెబుతోంది.

వివరాలు 

రకరకాల పనులు చేస్తున్న రోబోలు

చైనాలోని ఫ్యాక్టరీల్లో రోబోలు విభిన్న పనులు చేస్తున్నాయి. బాక్సులను కన్వేయర్ బెల్ట్‌లపై ఎక్కించడం నుండి కార్ల భాగాలను వెల్డింగ్ చేయడం వరకూ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో వీటి పనితీరు మరింత మెరుగుపరుస్తున్నారు. కొన్ని పరిశ్రమల్లో కార్మికుల అవసరం తగ్గగా, మరికొన్నిచోట్ల యంత్రాలతో పాటు మనుషులు కూడా కొత్త విధానంలో పనులు చేస్తున్నారు.

వివరాలు 

ప్రభుత్వ ప్రోత్సాహంతో విస్తరణ

రోబోటిక్స్‌ విస్తరణ వెనుక బీజింగ్‌ ప్రభుత్వం కీలకపాత్ర పోషించింది. సబ్సిడీలు,తక్కువ వడ్డీ రుణాలు, ప్రత్యేక ఆదేశాల ద్వారా దేశీయ తయారీదారులను రోబోట్లపై పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. 2015లో ప్రకటించిన Made in China 2025 వ్యూహంలో రోబోటిక్స్‌ను ప్రాధాన్య పరిశ్రమగా గుర్తించారు. 2017నుంచి ప్రతి సంవత్సరం 1.5లక్షలకు పైగా రోబోలను ఫ్యాక్టరీల్లో ఇన్‌స్టాల్ చేస్తూ వస్తున్నాయి. దిగుమతిదారుడి నుండి సరఫరాదారుడిగా మారిన చైనా ఒకప్పుడు చైనాకు అవసరమైన రోబోలు ఎక్కువగా విదేశాల నుండి దిగుమతి చేసుకునేవి.అయితే 2024నాటికి ఉపయోగంలో ఉన్న రోబోలలో దాదాపు 60శాతం చైనాలోనే తయారైనవే. దీంతో విదేశీపోటీదారులకు గట్టి సవాలు విసిరింది.గత ఏడాది చైనా ప్రపంచ రోబోట్‌ తయారీ మార్కెట్లో మూడొంతులు దక్కించుకుంది.ఇంతకాలం ఆధిపత్యం చెలాయించిన జపాన్‌ను కూడా అధిగమించింది.

వివరాలు 

తయారీ రంగంలో చైనా ఆధిపత్యం

ప్రపంచ తయారీ రంగంలో చైనాకు ఉన్న ప్రాధాన్యం రోబోటిక్స్‌లో కూడా ప్రతిబింబిస్తోంది. ఈ ఏడాది ప్రారంభానికి చైనా ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు మూడొంతులు ఒంటరిగానే తయారు చేసింది. అమెరికా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, బ్రిటన్‌లను కలిపి ఉన్న స్థాయికంటే ఎక్కువ. జపాన్‌ గత ఏడాది 44 వేల రోబోలు మాత్రమే ఇన్‌స్టాల్ చేయగా, జర్మనీ, దక్షిణ కొరియాలో ఈ సంఖ్యలు తగ్గాయి.

వివరాలు 

వెనకబడుతున్న అమెరికా

చైనాతో పోల్చితే అమెరికా రోబోట్ల వినియోగంలో చాలా వెనకబడి ఉంది. గత ఏడాది కేవలం 34 వేల రోబోలు మాత్రమే ఇన్‌స్టాల్ చేశారు. మొత్తం చూస్తే అమెరికా కంటే ఐదు రెట్లు ఎక్కువ రోబోలు ఇప్పుడు చైనాలో ఉన్నాయి. అమెరికా కంపెనీలు ఉన్నత స్థాయి టెక్నాలజీలో ముందున్నా, విస్తృత స్థాయి రోబోట్ల వినియోగం మాత్రం చైనాలోనే ఎక్కువగా జరుగుతోంది. మానవ వనరుల ప్రాధాన్యం చైనాకు నైపుణ్యంతో ఉన్న ఇంజనీర్లు,ఎలక్ట్రీషియన్లు,ప్రోగ్రామర్లు ఎక్కువగా ఉండటం ఒక అదనపు బలం. అయినప్పటికీ నిపుణుల కోసం డిమాండ్‌ పెరగడంతో వారి జీతాలు సంవత్సరానికి 60వేల డాలర్ల వరకు చేరాయి. రోబోట్ల వినియోగం పెరిగినా,అది మానవ శ్రామికులను పూర్తిగా భర్తీ చెయ్యదు. బదులుగా, నైపుణ్యాలున్న ఉద్యోగాలకు కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి.

వివరాలు 

హ్యూమనాయిడ్ రోబోట్లు

ఫ్యాక్టరీ రోబోట్లతో పాటు చైనాలో హ్యూమనాయిడ్ రోబోట్ల తయారీలోనూ కొత్త స్టార్ట్‌అప్స్‌ పెరుగుతున్నాయి. హాంగ్‌జౌలోని Unitree Robotics తక్కువ ఖర్చుతో హ్యూమనాయిడ్ మోడల్స్‌ అభివృద్ధి చేస్తోంది. అమెరికా కంపెనీలు బోస్టన్ డైనమిక్స్ వంటి సంస్థలతో పోలిస్తే చైనా రోబోలు చాలా చవకగా ఉంటాయి. ఇంకా కొన్ని ఆధునిక భాగాల్లో వెనుకబడి ఉన్నా, ప్రభుత్వ మద్దతుతో వేగంగా ముందుకు వెళ్తోంది. కృత్రిమ మేధస్సు తోడ్పాటు AI టెక్నాలజీ చైనా ఫ్యాక్టరీలకు మరో బలం. యంత్రాల పనితీరు పర్యవేక్షించడం, లోపాలను గుర్తించడం, ముందుగానే మెయింటెనెన్స్ అంచనా వేయడం వంటి పనుల్లో AI వినియోగం పెరుగుతోంది. ఇతర దేశాలు AIని వినియోగదారుల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటే, చైనా మాత్రం పరిశ్రమల రంగంలో దానిని మరింత దూకుడుగా వాడుతోంది.

వివరాలు 

ప్రపంచ తయారీ సమతుల్యంలో మార్పు

చైనాలో రోబోట్ల పెరుగుదల కేవలం టెక్నాలజీ వినియోగమే కాదు, గ్లోబల్ తయారీ సమతుల్యాన్ని మార్చే పరిణామం. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో రోబోట్‌ ఇన్‌స్టాలేషన్‌ మందగిస్తుంటే, చైనా మాత్రం విస్తృత స్థాయిలో ముందుకు దూసుకెళ్తోంది. తయారీ రంగంలోనూ, రోబోట్ల సరఫరాలోనూ చైనా ఇప్పుడు ఆధిపత్యాన్ని సాధించింది.