
Fire Accident: చైనాలో విషాద ఘటన.. రెస్టారంట్‌లో భారీగా మంటలు.. 22 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఒక రెస్టారెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం 22 మంది ప్రాణాలను బలిగొంది.
ఈ దుర్ఘటన మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో సంభవించింది. అకస్మాత్తుగా రెస్టారెంట్‌లో మంటలు చెలరేగడంతో, అక్కడ ఉన్న 22 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషయాన్ని స్థానిక మీడియా నివేదించింది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు.
వివరాలు
చైనాలో ఇది రెండవ అతిపెద్ద అగ్నిప్రమాదం
ఈ ఘోర ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుత నెలలో చైనాలో ఇది రెండవ అతిపెద్ద అగ్నిప్రమాదంగా నమోదైంది. గత ఏప్రిల్ 9న నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగిన ఘటనలో 20 మంది వృద్ధులు దుర్మరణం పాలయ్యారు.
చెంగ్డే నగరానికి సమీపంలోని లాంగ్హువా కౌంటీలో ఉన్న ఆ నర్సింగ్ హోమ్‌లో ప్రమాదం సంభవించిన సమయంలో భవనంలో మొత్తం 39 మంది వృద్ధులు ఉండగా, వారిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.