China: అవినీతిపై చైనా ఉక్కుపాదం.. మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రక్షణశాఖకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులపై సైనిక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అవినీతి ఆరోపణలు రుజువుకావడంతో వీ ఫెంగే, లీ షాంగ్‌లకు మరణశిక్ష విధించారు. లంచాలు స్వీకరించిన కేసులో ఫెంగే దోషిగా తేలగా, లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో షాంగ్‌పై కూడా నేరం నిర్ధారణ అయింది. అయితే ఈ శిక్ష అమలును రెండేళ్లపాటు నిలిపివేస్తూ తీర్పు ఇచ్చినట్లు అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. వీ ఫెంగే 2018 నుంచి 2023 వరకు చైనా రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు దేశానికి కీలకమైన రాకెట్ దళానికి అధిపతిగా సేవలందించారు. ఆయన తరువాత లీ షాంగ్ రక్షణశాఖ మంత్రిగా నియమితులయ్యారు.
వివరాలు
లక్షలాది మంది అధికారులపై చర్యలు
ఈ పదవికి ఆయన్ను చైనా అధ్యక్షుడు స్వయంగా ఎంపిక చేసినప్పటికీ, ఏడాది లోపే ఆయనను పదవి నుంచి తొలగించారు. అనంతరం షాంగ్ కొన్ని నెలలపాటు కనిపించకుండా పోయారు. 2024లో అధికార కమ్యూనిస్టు పార్టీ ఈ ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించింది. చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జిన్‌పింగ్ నేతృత్వంలో పాలక కమ్యూనిస్టు పార్టీ అవినీతి నిర్మూలనపై విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు లక్షలాది మంది అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ జాబితాలో ఉన్నత స్థాయి సైనికాధికారులు కూడా ఉండటం విశేషం.