Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం
ఈ వార్తాకథనం ఏంటి
మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందజేస్తామని చైనా ప్రకటించింది.
దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కూడా కుదిరింది.
ఈ ఒప్పందం భారత్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశేషమేమిటంటే, ముయిజు బీజింగ్‌లో పర్యటించిన కొద్ది వారాలకే రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం జరగడం గమనార్హం.
ముయిజ్జు చైనాలో పర్యంటించిన తర్వాతే.. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.
మొహమ్మద్ ముయిజ్జూ మాల్దీవులకు అధ్యక్షుడు అయిన కొద్ది రోజులకే భారతదేశం తన సైనికులను ఉపసంహరించుకోవలసి ఉంటుందని చెప్పారు.
అలాగే విధానపరంగా, ముయిజ్జు చైనా ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.
మాల్దీవులు
ఒప్పందం వివరాలను వెల్లడించని మాల్దీవులు
మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్, చైనా ఇంటర్నేషనల్ మిలిటరీ కోఆపరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ జాంగ్ బాకున్‌తో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.
రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడానికి చైనా సైనిక సాయం అందించే ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అయితే ఈ రక్షణ సహకార ఒప్పందం వివరాలను మాల్దీవులు వెల్లడించలేదు.
చైనా మిలిటరీ ప్రతినిధి బృందం ఇటీవల మాల్దీవుల రాజధాని మాలేను సందర్శించింది.
జియాంగ్ యాంగ్ హాంగ్ 03 అనే హైటెక్ చైనీస్ రీసెర్చ్ షిప్‌ను మాలేలో అదుపులోకి తీసుకున్న తరుణంలో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
చైనా
మాల్దీవులు-చైనా ఒప్పందంపై భారత్ ఎందుకు భయపడుతోంది?
ఈ ఒప్పందం తర్వాత చైనా యుద్ధనౌకలు మాల్దీవుల్లోని ఓడరేవుల్లో పాగా వేసే అవకాశం ఉంది.
ఇది కాకుండా, చైనా నావికాదళం మాల్దీవులలో తన శాశ్వత లేదా తాత్కాలిక స్థావరాన్ని కూడా నిర్మించుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.
దేశంలోని ప్రాదేశిక జలాలపై 24 గంటల పర్యవేక్షణ కోసం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ప్రకటించారు.
అయితే మహ్మద్ ముయిజ్జు చెప్పిన నిఘా వ్యవస్థ చైనీస్ రాడార్ అయితే.. భారత్‌కు రక్షణ, నిఘా పరంగా మరింత ఇబ్బందులు తలెత్తుతాయి.
చైనీస్ రాడార్ వ్యవస్థ భారతదేశ ప్రాదేశిక జలాలపై గూఢచర్యం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మాల్దీవులు, చైనా కలిసి హిందూ మహాసముద్రంలో భారత్‌కు కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉంది.