LOADING...
Chinese Petrol: గాలితోనే పెట్రోల్ తయారీ?.. చైనా కంపెనీ సంచలన ప్రకటన
గాలితోనే పెట్రోల్ తయారీ?.. చైనా కంపెనీ సంచలన ప్రకటన

Chinese Petrol: గాలితోనే పెట్రోల్ తయారీ?.. చైనా కంపెనీ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Moogati Shabari
Mar 18, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెట్రోల్ కోసం ఇక భూమిలో తవ్వాల్సిన అవసరం లేకపోవచ్చా? గాలి, నీటితోనే ఇంధనం తయారు చేయగలమంటూ చైనాకు చెందిన ఒక స్టార్టప్ సంచలన ప్రకటన చేసింది. షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న కార్బోనోలజీ (Carbonology) అనే సంస్థ తక్కువ ఖర్చుతో కృత్రిమ పెట్రోలియంను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. చైనా మీడియా సంస్థ కైలిన్షే (Cailianshe) వెల్లడించిన వివరాల ప్రకారం.. గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను, నీటిని ఉపయోగించి సౌర, వాయు శక్తి సహాయంతో కృత్రిమ ఇంధనంగా మార్చే విధానాన్ని కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ ప్రక్రియ ద్వారా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, నాఫ్తా వంటి ఉత్పత్తులను మార్కెట్ ధరలకు సమానంగా విక్రయించగలమని కంపెనీ చెబుతోంది.

వివరాలు

పెద్ద ఎత్తున పెట్టుబడులు..

ఈ ప్రకటన ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఉద్రిక్తతల సమయంలో రావడం గమనార్హం. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న సైనిక ఘర్షణల కారణంగా సరఫరా అంతరాయం, మౌలిక సదుపాయాలపై దాడులు, ఉత్పత్తి తగ్గుదల వంటి కారణాలతో ధరల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చైనా తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 70 శాతం కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల అభివృద్ధిపై చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. దీనిలో భాగంగా కార్బన్ క్యాప్చర్, వినియోగం, నిల్వ సాంకేతికతలను ప్రోత్సహిస్తున్నట్లు చైనా జాతీయ ఇంధన సంస్థ పేర్కొంది.

వివరాలు

కోట్ల రూపాయల సమీకరణ..

అయితే ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కంపెనీ వద్ద సుమారు 14 మిలియన్ యువాన్ మూలధనం ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరం ఏంజెల్ ఫండింగ్ ద్వారా కూడా కోట్ల రూపాయలు సమీకరించింది. ఇటీవల షాంఘైలో సుమారు 300 మిలియన్ యువాన్ వ్యయంతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ద్వారా ప్రయోగశాల స్థాయి టెక్నాలజీని పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్లాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కృత్రిమ ఇంధన ఉత్పత్తి ఇంకా సవాళ్లతోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఖర్చులు అధికంగా ఉండటం, శక్తి మార్పిడి సామర్థ్యం తక్కువగా ఉండటం, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి.

Advertisement

వివరాలు

భూగర్భంలో కార్బన్ నిల్వచేస్తున్న చైనా

ప్రస్తుతం ఈ కృత్రిమ ఇంధనం ధర గ్యాలన్‌కు సుమారు 14 డాలర్లు ఉండగా, ఇది అమెరికాలో పెట్రోల్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ సాంకేతికతపై కొంత అనుమానం ఉంది. గాలిలోని కార్బన్‌ను పట్టుకుని ఇంధనంగా మార్చే టెక్నాలజీలపై చైనా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎక్కువగా సేకరించిన కార్బన్‌ను భూగర్భంలో నిల్వ చేయడానికే ఉపయోగిస్తున్నారు.

Advertisement