India-Pakistan: పాక్ సైన్యం ఖనిజాల దోపిడీ.. ఐరాసలో భారత్ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని సహజ వనరులను ఆ దేశ సైన్యం స్వప్రయోజనాల కోసం ఎలా దోచుకుంటోందో భారత్ ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా బయటపెట్టింది. దేశ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా సైనిక ఉన్నతాధికారులు జాతీయ సంపదను తమ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి. హరీశ్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల అభివృద్ధి కంటే సైనికాధికారుల వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న లైబీరియా.. 'సహజ వనరులు-సంఘర్షణ: నివారణ, శాంతి కోసం సహకారాన్ని బలోపేతం చేయడం' అనే అంశంపై అనధికారిక సమావేశాన్ని నిర్వహించింది.
వివరాలు
విదేశీ నేతలకు ఖనిజాల పెట్టె చూపించిన ఆసిమ్ మునీర్
ఈ సమావేశంలో భారత ప్రతినిధి పి. హరీశ్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా గతేడాది సెప్టెంబరులో పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.
ఖనిజాలను చెక్క పెట్టెలో ఉంచి విదేశీ నేతలకు చూపించిన ఘటనను గుర్తుచేశారు.
పాకిస్థాన్ సహజ వనరుల దోపిడీలో అక్కడి సైన్యం ప్రత్యక్షంగా పాల్గొంటోందనడానికి ఈ ఉదంతమే నిదర్శనమని హరీశ్ వ్యాఖ్యానించారు.
వివరాలు
గనుల కోసమే ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రభుత్వ రద్దు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో రాజకీయ పరిణామాల వెనుక కూడా సైన్యం స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని హరీశ్ ఆరోపించారు.
అక్కడి పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం, ఎమర్జెన్సీ విధించడం వెనుక ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశం ఉందని విమర్శించారు.
పాకిస్థాన్‌ను వాస్తవంగా పాలిస్తున్న సైనికాధికారులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, దేశ ప్రజల సంక్షేమం కోసం సహజ వనరులను వినియోగించాలని హితవు పలికారు.
వివరాలు
తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసుకోవడానికి పాకిస్థాన్ ఐరాస వేదికను ఉపయోగించుకుంటోంది
ఇదిలా ఉండగా.. ఐరాస సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి ఉస్మాన్ జాదూన్ సింధు జలాల ఒప్పందం అంశాన్ని ప్రస్తావించారు.
సమావేశం ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తూ ఈ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ తీవ్రంగా స్పందించింది.
తన తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసుకోవడానికి పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగించుకుంటోందని పి. హరీశ్ మండిపడ్డారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వైఖరిని పాకిస్థాన్ విడిచిపెట్టేంతవరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేసే నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.