Florida Plane Crash: ఫ్లోరిడా విమాన ప్రమాదం.. చివరి క్షణాల్లో కెప్టెన్ ప్రార్థన.. కో-పైలట్ సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన హృదయ విదారక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కో-పైలట్ తన ప్రియుడికి సందేశం పంపినట్లు, చివరి క్షణాల్లో కెప్టెన్ ప్రార్థన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆదివారం టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బహమాస్‌కు వెళ్తున్న లీర్‌జెట్ 60 విమానం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో ప్రమాదానికి గురైంది. విమానం కూలిపోవడానికి సుమారు 10 నిమిషాల ముందు 20 ఏళ్ల కో-పైలట్ నథాలియా గడెల్హా ఫిల్గుయిరాస్ తన ప్రియుడికి టెక్స్ట్ సందేశం పంపారు. ఆమె ప్రియుడు కూడా పైలట్ కావడం గమనార్హం. విమానంలో తీవ్రమైన కదలికలు ఉన్నాయని, మంచు పేరుకుపోతోందని ఆమె ఆ సందేశంలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వివరాలు
కాక్‌పిట్ ఆడియో రికార్డింగ్‌లో చివరి క్షణాల సంభాషణలు
ప్రమాదానికి ముందు విమాన సిబ్బంది మంచు, బలమైన గాలుల గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు.
ఆ తర్వాత విమానం అదుపు తప్పి వేగంగా కిందకు దూసుకెళ్లింది. నిమిషానికి 20 వేల అడుగుల వేగంతో విమానం కిందకు పడిపోతున్నట్లు అత్యవసర 'మేడే' కాల్‌లో నమోదైంది.
విమానంలోని కాక్‌పిట్ ఆడియో రికార్డింగ్‌లో చివరి క్షణాల సంభాషణలు నమోదయ్యాయి.
55 ఏళ్ల కెప్టెన్ జెఫ్ గ్రెగరీ ప్రార్థన చేయడం ప్రారంభించగా, కో-పైలట్ నథాలియా "మనం కూలిపోబోతున్నాం" అని చెప్పినట్లు ఆడియోలో వినిపించింది.
ఆ తర్వాత కొద్ది క్షణాలకే విమానం జనావాసాలకు సమీపంలోని రోడ్డుపై కూలిపోయింది. భారీ పేలుడు సంభవించింది.
వివరాలు
ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు
ఈ ప్రమాదంలో టెక్ పారిశ్రామికవేత్త ఆడమ్ రాబిన్సన్, ఆయన భార్య హెలెన్ షార్ప్, వారి ఇద్దరు పిల్లలు, పిల్లల సంరక్షకురాలు, మరో ఇద్దరు కుటుంబ స్నేహితులు సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు కొనసాగిస్తోంది.