
USA: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో కలకలం.. 1,800 విమానాలకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (USA) విమాన సర్వీసులకు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. టెలికాం సర్వీసుల్లో వచ్చిన లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపారు. దీని ప్రభావం డాలస్ సహా పలు విమానాశ్రయాలపై పడగా, మొత్తం 1,800 విమానాలు ప్రభావితమయ్యాయి. స్థానిక టెలికాం కంపెనీ పరికరాల్లో సమస్య ఉత్పన్నమైనదే దీనికి కారణమని, FAAకు దీతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. సమస్యను గుర్తించి పరిష్కరించే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో డాలస్ విమానాశ్రయంలో సుమారు 20 శాతం విమానాలు రద్దయినట్టు తెలిపారు.
Details
200 విమానాలకు పైగా రద్దు
అందులో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన 200 కంటే ఎక్కువ విమానాలు రద్దవగా, మరో 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడవనున్నాయి. విమానాల ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్‌అవేర్ ప్రకారం, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1,100కు పైగా విమానాలు తీవ్రంగా ఆలస్యమవనున్నాయని సమాచారం. ఈ సంవత్సరం FAA తన కమ్యూనికేషన్ సర్వీసుల్లో తరచుగా సమస్యలను ఎదుర్కొంటున్నది. గురువారం కూడా డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం తలెత్తి, రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూఎస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సమస్యల పరిష్కారం కోసం అమెరికా ప్రభుత్వం ఇప్పటికే జూలైలో 12.5 బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే.