Ebola Virus: కాంగోలో ఎబోలా కలకలం.. 101 మంది మృతి.. ,550 దాటిన కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ బారినపడి ఇప్పటివరకు 101 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాంగో ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 550కు పైగా ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో 101 మంది మృతి చెందగా, 19 మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 309 మంది ఎబోలా లక్షణాలతో ఐసోలేషన్‌లో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ఇటురి, నార్త్ కివు ప్రాంతాల్లో 35 కొత్త కేసులు వెలుగుచూశాయి.
వివరాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం
అదే సమయంలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోందని,అయితే కొద్ది రోజుల తర్వాత తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. ఎబోలా వ్యాధిని వేగంగా గుర్తించడం, వైరస్‌కు పూర్తిస్థాయి టీకా, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేకపోవడం పెద్ద సవాళ్లుగా మారాయని అధికారులు తెలిపారు. ఇంకా గుర్తించని కేసులు కూడా ఉండే అవకాశముందని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తం చేసింది. ఎబోలా వైరస్ ప్రాంతీయంగా మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పక్క దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వివరాలు
మధ్య ఆఫ్రికా ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి
ఇక పొరుగు దేశమైన ఉగాండాలోనూ ఎబోలా ప్రభావం కనిపిస్తోంది. అక్కడ ఇప్పటివరకు 19 కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మధ్య ఆఫ్రికా ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి అంతర్జాతీయ ఆరోగ్య వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది.