US Drones: ఇరాన్ దాడులకు కౌంటర్.. పశ్చిమాసియాలో 10 వేల అమెరికా డ్రోన్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్ పై దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. డ్రోన్లు, క్షిపణులను భారీ స్థాయిలో వినియోగిస్తూ పశ్చిమాసియాలో యుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా సుమారు 10 వేల డ్రోన్లను పశ్చిమాసియాలో మోహరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇవి కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో పనిచేసే మెరోప్స్ ఇంటర్‌సెప్టర్ డ్రోన్ డ్రోన్లు. శత్రువులు ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లను గుర్తించి వాటిని గాల్లోనే ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ మెరోప్స్ డ్రోన్లను ఎరిక్ ష్మిత్ నాయకత్వంలోని రక్షణ ఉత్పత్తుల సంస్థ ప్రాజెక్టు ఈగల్ లో భాగంగా అభివృద్ధి చేసింది. 2024లో జరిగిన రష్యా- ఉక్రెయిన్ యుద్ద సమయంలో కూడా వీటిని భారీ స్థాయిలో ఉపయోగించారు.
Details
ఒక్కో డ్రోన్ ధర 15 వేల డాలర్లు
అప్పుడు ఇరాన్ అభివృద్ధి చేసిన షాహెద్ డ్రోన్ లను రష్యా వినియోగించగా, వాటిని మెరోప్స్ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు సమర్థవంతంగా కూల్చివేశాయని అమెరికా రక్షణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో కూడా ఇరాన్ షాహెద్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. వాటిని అడ్డుకునేందుకు అమెరికా పెద్ద సంఖ్యలో మెరోప్స్ డ్రోన్లను మోహరిస్తున్నట్లు సమాచారం. మెరోప్స్ ఇంటర్‌సెప్టర్ ఒక్కో డ్రోన్ ధర సుమారు 14వేల నుంచి 15వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. అయితే భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తే ధర 3 వేల నుంచి 5వేల డాలర్ల మధ్యకు తగ్గుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్‌ను తయారు చేయడానికి సుమారు 20వేల డాలర్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.