Covid: కరోనా టీకాల భద్రతపై మళ్లీ గందరగోళం.. ఎఫ్‌డీఏ దర్యాప్తు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన మరణాలపై విస్తృత స్థాయి విచారణ ప్రారంభించిందని హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ కార్యాలయ ప్రతినిధి ఆండ్రూ నిక్సన్ తెలిపారు. ఈ విషయం మంగళవారం (డిసెంబర్ 9) వెలుగులోకి రావడంతో వైద్య వర్గాల్లో మరోసారి ఆందోళన నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీర్ఘకాలికంగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా పేరున్న కెన్నెడీని ఆరోగ్య శాఖ అధిపతిగా నియమించడంతో ఇప్పటికే అమెరికా వ్యాక్సిన్ విధానాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాలు
కరోనా వ్యాక్సిన్ మరణాలపై ఎఫ్‌డీఏ దర్యాప్తు
"కరోనా టీకాల వల్ల మరణాలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న కేసులపై ఎఫ్‌డీఏ పలు వయో వర్గాల్లో లోతైన విచారణ జరుపుతోంది" అని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగ ప్రతినిధి ఆండ్రూ నిక్సన్ ఏఎఫ్‌పీకి తెలిపారు. ఈ విచారణపై బ్లూమ్‌బర్గ్,వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు ముందుగానే కథనాలు ప్రచురించాయి. మొదట పిల్లల మరణాలకే విచారణ పరిమితం అవుతుందని భావించినప్పటికీ,ఇప్పుడు దర్యాప్తు పరిధి మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. నవంబర్ చివర్లో ఎఫ్‌డీఏ అంతర్గత పత్రం లీక్ కావడంతో ఈ వ్యవహారం దుమారం రేపింది. ఆ నోట్‌లో కరోనా టీకాలతో కనీసం 10 శిశు మరణాలకు సంబంధం ఉందని పేర్కొన్నారు. అయితే దానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేదా గణాంకాలు ఇవ్వలేదని సమాచారం.
వివరాలు
కరోనా టీకాలు ఎంత భద్రం?
ఈ విచారణ ఎలా జరుగుతోంది, ఏ డేటాను పరిశీలిస్తున్నారు, ఫలితాలు ఎప్పుడొస్తాయన్న వివరాలను నిక్సన్ వెల్లడించేందుకు నిరాకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అధికారులు కరోనా టీకాల భద్రత, ప్రభావం పూర్తిగా పరీక్షించబడ్డాయని పదేపదే స్పష్టం చేస్తున్నారు. అరుదుగా కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు బయటపడినా, అవి అధిక శాతం ప్రజలకు టీకాల వల్ల కలిగే ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించినవికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రభుత్వంలోని తాజా నిర్ణయాలు, ముఖ్యంగా పునర్వ్యవస్థీకరించిన సీడీసీ సలహా కమిటీతో పాటు వ్యాక్సిన్ వ్యతిరేక వైఖరి వైద్య శాస్త్రం కంటే రాజకీయ భావజాలానికే ప్రాధాన్యం ఇస్తున్నారేమో అన్న భయాన్ని పెంచుతున్నాయి.
వివరాలు
కరోనా టీకాలు ఎంత భద్రం?
కెన్నెడీ నాయకత్వంలో ఎఫ్‌డీఏ తీసుకుంటున్న దిశపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కెన్నెడీ వ్యాక్సిన్‌లపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేసిన చరిత్ర ఉన్నట్లు వైద్య వర్గాలు గుర్తుచేస్తున్నాయి. 2023లో ఆయన కరోనా టీకాలు ప్రాణాంతకమని వ్యాఖ్యానించడమే కాకుండా, ఈ వైరస్ ప్రత్యేకంగా నల్లజాతి, శ్వేతజాతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని, ఆష్కెనాజీ యూదులు, చైనా ప్రజలను విడిచిపెట్టిందంటూ ఆధారాల్లేని ఆరోపణలు చేశారు.