LOADING...
Cuba: క్యూబా వద్ద 300కు పైగా సైనిక డ్రోన్లు ఉన్నాయని అమెరికా ఆందోళన
క్యూబా వద్ద 300కు పైగా సైనిక డ్రోన్లు ఉన్నాయని అమెరికా ఆందోళన

Cuba: క్యూబా వద్ద 300కు పైగా సైనిక డ్రోన్లు ఉన్నాయని అమెరికా ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

క్యూబాను అమెరికా తాజాగా భద్రతకు ముప్పుగా భావిస్తోంది. హవానా ప్రభుత్వం మూడు వందలకు పైగా సైనిక డ్రోన్లను సమీకరించిందని, అమెరికా లక్ష్యాలపై దాడులకు సంబంధించిన వ్యూహాలపై చర్చలు జరుగుతున్నాయని గోప్య నిఘా వర్గాలు గుర్తించినట్లు 'యాక్సియోస్' వెల్లడించింది. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ట్రంప్ యంత్రాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే గ్వాంటనామో బేలోని అమెరికా నౌకాదళ స్థావరం,యుద్ధ నౌకలు, ఫ్లోరిడాలోని కీ వెస్ట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలను క్యూబా సిద్ధం చేసినట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు క్యూబా-రష్యా, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం కూడా అమెరికాను కలవరపెడుతోంది. హవానాలో ఇరాన్ సైనిక సలహాదారుల ఉనికి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

క్యూబా మాజీ నేత రౌల్ క్యాస్ట్రోపై అభియోగాలు నమోదు

"అమెరికాకు అత్యంత సమీపంలో ఇలాంటి సాంకేతిక సామర్థ్యాలు పెరగడం ఆందోళనకర విషయం. ఇది క్రమంగా పెరుగుతున్న ముప్పుగా మారుతోంది" అని ఓ ఉన్నతస్థాయి అమెరికా అధికారి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా గూఢచారి సంస్థ అధిపతి జాన్ రాట్‌క్లిఫ్ గురువారం క్యూబా పర్యటన చేపట్టి, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో 1996లో రెండు విమానాలను కూల్చివేసిన ఘటనలో క్యూబా మాజీ నేత రౌల్ క్యాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసేందుకు అమెరికా న్యాయశాఖ చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.

వివరాలు 

అమెరికా ఆరోపణలను ఖండించిన క్యూబా విదేశాంగ మంత్రి

అమెరికా ఆరోపణలను క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ ఖండించారు. క్యూబాపై ఆంక్షలు, సైనిక ఒత్తిడి కొనసాగించేందుకు అమెరికా తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం తమ దేశానికి ఆత్మరక్షణ హక్కు ఉందని స్పష్టం చేశారు. అయితే డ్రోన్ల సమీకరణపై వచ్చిన ఆరోపణలను మాత్రం క్యూబా నేరుగా తిరస్కరించలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పాల్గొన్న క్యూబా సైనికులు డ్రోన్ యుద్ధ విధానాలపై అనుభవం సంపాదించుకున్నారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇది 1962 క్షిపణి సంక్షోభం తరహాలో తక్షణ ప్రమాదం కాదని, కానీ అమెరికాకు అత్యంత సమీపంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం మాత్రం గంభీర అంశమేనని అధికారులు పేర్కొన్నారు.

Advertisement