US Air Force Cyber Attack: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు సైబర్ షాక్.. కీలక వ్యవస్థలోకి హ్యాకర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మిలిటరీలో అత్యంత కీలకమైన ఎయిర్‌ఫోర్స్ వ్యవస్థకు హ్యాకర్ల నుంచి ముప్పు ఎదురైంది. వాయుసేనకు మెదడులా పనిచేసే క్లౌడ్ కంట్రోల్ ప్లేన్ వ్యవస్థలోకి సైబర్ నేరగాళ్లు చొరబడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైబర్ దాడులు, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అమెరికాకు ఇది మరో కొత్త తలనొప్పిగా మారింది. ఈ పరిణామంతో అత్యంత సున్నితమైన మిలిటరీ రహస్యాలు, సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, లాజిస్టిక్స్ డేటా ప్రమాదంలో పడినట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో క్లౌడ్ వన్ విభాగం చేపట్టిన అప్‌గ్రేడ్ సమయంలో ఈ సైబర్ దాడిని తొలిసారిగా గుర్తించింది.
వివరాలు
ఏమిటీ క్లౌడ్ వన్?
అమెరికా వాయుసేన ఐటీ అవసరాలను తీర్చేందుకు 2017లో క్లౌడ్ వన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఆల్ఫాబెట్ సంస్థల నుంచి అందే క్లౌడ్ సేవలను ఇది సమన్వయం చేస్తుంది.
సిబ్బంది వివరాలు, జీతాలు, లాజిస్టిక్స్, నిర్వహణ (మెయింటెనెన్స్)కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ వ్యవస్థ నిర్వహిస్తుంది. అంతేకాకుండా స్పేస్‌ఫోర్స్‌కు కూడా సేవలు అందిస్తోంది.
వివరాలు
అత్యంత కీలకమైన సమాచారం ఇక్కడే..
అమెరికా వాయుసేన క్లౌడ్ వ్యవస్థలో ఉత్తర అమెరికా రాడార్ల నుంచి అందే సమాచారాన్ని సమన్వయం చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 అమెరికా ఎయిర్‌బేసుల్లో మందుగుండు సామగ్రి, బాంబులు, క్షిపణుల వివరాలను ట్రాక్ చేసే థియేటర్ ఇంటిగ్రేటెడ్ కంబాట్ మ్యూనిషన్ వ్యవస్థ కూడా ఇందులోనే ఉంది.
అయితే హ్యాకర్లు ఏదో ఒక అప్లికేషన్‌లోకి మాత్రమే చొరబడలేదని.. మొత్తం క్లౌడ్ వ్యవస్థను నియంత్రించే కంట్రోల్ ప్లేన్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
దీంతో ఈ వ్యవస్థలోని కీలక సమాచారం భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
వివరాలు
అమెరికాలో ఆరు భారీ సైబర్ దాడులు
క్లౌడ్ వ్యవస్థల్లోకి చొరబడేందుకు హ్యాకర్లు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్‌ను ఉపయోగించడం ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది.
నెట్‌వర్క్‌లోని బలహీనతలను ఈ టూల్స్ వేగంగా గుర్తించి సైబర్ దాడులకు సహకరిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఆరు భారీ సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి.
వీటి బాధితుల జాబితాలో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) కూడా ఉండటం గమనార్హం.