Dalai Lama: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దలైలమా పేరు.. వాస్తవాలు బయటపెట్టిన కార్యాలయం
ఈ వార్తాకథనం ఏంటి
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక గురువు దలైలామాకు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అయితే ఈ ఆరోపణలను దలైలామా కార్యాలయం తాజాగా తీవ్రంగా ఖండించింది. దలైలామా ఎప్పుడూ కూడా ఎప్‌స్టీన్‌ను కలవలేదని స్పష్టంగా తెలిపింది. అంతేకాదు ఆయన తరఫున మరెవరికీ ఎప్‌స్టీన్‌తో సమావేశం అయ్యేందుకు ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలకు ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనేక మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల పేర్లు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Details
ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ
ఈ క్రమంలోనే దలైలామా పేరు కూడా ప్రచారంలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. తమ గౌరవానికి భంగం కలిగించేలా జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని దలైలామా కార్యాలయం తీవ్రంగా ఖండించింది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన సుమారు 30 లక్షల ఫైళ్లను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా విడుదల చేసింది. ఈ ఫైళ్లలో రెండు వేలకుపైగా వీడియోలు, లక్షా ఎనభై వేల ఫొటోలు ఉన్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్లలో డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి ప్రముఖుల పేర్లు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈవ్యవహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారడంతో ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ కొనసాగుతోంది.