Elon Musk: అంతరిక్షంలో ప్రమాదకర పరిణామం.. కూలిపోతున్న స్టార్‌లింక్ ఉపగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్‌లింక్ ప్రాజెక్టులో భాగమైన ఒక ఉపగ్రహం తాజాగా నియంత్రణ కోల్పోయి భూమివైపు కదులుతోంది. ఈ నెల 17వ తేదీన '35956' నంబర్ స్టార్‌లింక్ ఉపగ్రహం భూమి నుంచి సుమారు 418 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ఉన్నట్లు గుర్తించారు. అయితే అనూహ్యంగా అక్కడి నుంచి అది వేగంగా దిగజారడం ప్రారంభించింది. దీంతో ఆ ఉపగ్రహంపై స్పేస్‌ఎక్స్ నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటనపై స్పందించిన స్పేస్‌ఎక్స్ సంస్థ, ఉపగ్రహంలో హఠాత్తుగా సాంకేతిక లోపం తలెత్తినట్లు వెల్లడించింది. ప్రొపెల్షన్ ట్యాంక్‌లో ఉన్న గ్యాస్ అత్యంత శక్తివంతంగా ఒక్కసారిగా బయటకు వెలువడటంతో ఉపగ్రహం సుమారు నాలుగు కిలోమీటర్ల మేర దిగజారిందని వివరించింది.
Details
ఎలాంటి ముప్పు లేదు
అనంతరం ఉపగ్రహంలోని కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కదలడం ప్రారంభించినట్లు తెలిపింది. ఈ శకలాలు వారం రోజుల్లోగా భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోవచ్చని స్పేస్‌ఎక్స్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది. ఇదిలా ఉండగా, శనివారం ఈ ఉపగ్రహ శకలాలు అమెరికాలోని అలాస్కా సమీపంలోని గగనతలంలో ప్రయాణిస్తుండగా, వెంటోర్‌టెక్ సంస్థకు చెందిన 'వరల్డ్‌వ్యూ-3' ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి హైరిజల్యూషన్ చిత్రాలను తీసింది. ఈ ఘటన వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు గానీ, భూమికి గానీ ఎలాంటి ముప్పు లేదని స్పేస్‌ఎక్స్ స్పష్టం చేసింది.
Details
భూగురుత్వాకర్షణ శక్తి సులభంగా ఆకర్షిస్తోంది
ప్రస్తుతం ఈ ఉపగ్రహం ఐఎస్‌ఎస్ కంటే దిగువ కక్ష్యలో ఉందని తెలిపింది. లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉండటంతో భూగురుత్వాకర్షణ శక్తి దానిని సులభంగా ఆకర్షిస్తుందని పేర్కొంది. భూవాతావరణంలోకి ప్రవేశించే సమయంలో ఘర్షణ కారణంగా ఈ శకలాలు పూర్తిగా కాలిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్‌లింక్ ప్రాజెక్టు కింద స్పేస్‌ఎక్స్ సుమారు 9,000 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. వీటి ద్వారా భూమిపై మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఈ ప్రాజెక్టును నాసా, యూఎస్ స్పేస్‌ఫోర్స్ వంటి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ స్పేస్‌ఎక్స్ కొనసాగిస్తోంది.