Canada కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన దంపతులు, వారి టీనేజీ కుమార్తె ఉన్నారు. మార్చి 7న బ్రాంప్టన్‌లోని బిగ్ స్కై వే, వాన్ కిర్క్ డ్రైవ్ పరిసరాల్లో ఇంట్లో మంటలు చెలరేగాయని స్థానిక పోలీసులు శుక్రవారం తెలిపారు. సంఘటనా స్థలానికి వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పంపగా.. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత.. అనుమానిత మానవ అవశేషాలను అధికారులు గుర్తించారు. అయితే ఆ మనవ అవశేషాలను వెంటనే గుర్తించలేకపోయారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా మృతుల గుర్తింపు
అయితే శుక్రవారం వచ్చిన ఫోరెన్సిక్, DNA నమూనాల రిపోర్ట్స్ ఆధారంగా భారత సంతతికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోయనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. రాజీవ్ (51), అతని భార్య శిల్పా కోతా (47), వారి 16 ఏళ్ల కుమార్తె మహేక్‌గా పోలీసులు గుర్తించారు. మంటలు చెలరేగడానికి ముందు కుటుంబం ఇంట్లోనే ఉందని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియరాలేదని, దాని వెనుక ఉన్న పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ముగ్గురు కుటుంబ సభ్యుల మృతిపై తమ విచారణ కొనసాగుతోందని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. దర్యాప్తులో సహాయం చేయడానికి ప్రజల సహకారాన్ని ఆయన కోరారు.