David Kozak: ప్రాగ్ యూనివర్శిటీలో 15మందిని పొట్టన పెట్టుకున్న డేవిడ్ కొజాక్, ఓ "అద్భుతమైన విద్యార్థి"
చెక్ రిపబ్లిక్ ప్రాగ్‌లోని చార్లెస్ యూనివర్శిటీలో గురువారం జరిగిన సమూహ కాల్పుల్లో కనీసం 15 మంది మరణించగా,25 మంది గాయపడ్డారు. చెక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్సిటీలోని ఫిలాసఫీ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెక్ రిపబ్లిక్ చరిత్రలోనే అత్యంత దారుణమైన సమూహ కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. కాల్పులు జరిపిన 24 ఏళ్ల విద్యార్థి డేవిడ్ కోజాక్‌గా గుర్తించారు. డేవిడ్ కొజాక్(24),ప్రాగ్ వెలుపల దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో నివసించాడు. చార్లెస్ విశ్వవిద్యాలయంలో పోలిష్ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని చదువుతున్నాడు. అతను "అద్భుతమైన విద్యార్థి" అని ప్రేగ్ పోలీస్ చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ చెప్పారు.
ప్రాగ్‌లో హత్యాకాండకు ముందు తన తండ్రిని కూడా చంపినట్లు అనుమానం
కొజాక్ చట్టబద్ధంగా అనేక తుపాకులను కలిగి ఉన్నాడు.కాల్పుల ఘటన సమయంలో భారీగా ఆయుధాలు కలిగి ఉన్న అతను చాల చాకచక్యంగా ప్లాన్ చేసి షూటింగ్‌కు పాల్పడినట్లు పోలీస్ చీఫ్ తెలిపారు. డేవిడ్ కొజాక్ ప్రాగ్‌లో హత్యాకాండకు ముందు సమీపంలోని హ్యూస్టన్‌లో తన తండ్రిని కూడా చంపినట్లు అనుమానిస్తున్నారు. యూనివర్శిటీ లోపల కొజాక్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా కాల్చి చంపారా అన్న విషయం తెలియరాలేదు. డేవిడ్ కొజాక్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో స్కూల్ షూటింగ్ ప్లాన్ చేయడం గురించి మెసేజ్ చేశాడు.
మెసేజింగ్ యాప్ లో కాల్పులు గురించి పోస్ట్
టెలిగ్రాఫ్ ప్రకారం,మెసేజింగ్ యాప్ లో తానూ స్కూల్లో ముందుగా కాల్పులు జరిపి ఆపై ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు ఒక పోస్ట్‌లో రాశాడు. పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన బాధితుల గురించి లేదా కాల్పులకు గల కారణాల గురించి ఎటువంటి సమాచారం అందించలేదు. చెక్ ఇంటీరియర్ మినిస్టర్ విట్ రకుసన్ మాట్లాడుతూ, తీవ్రవాద ఐడియాలజీ కానీ, గ్రూపులతో కానీ లింకులు ఉన్నట్లు అనుమానాలు లేవని చెప్పారు. యూనివర్సిటీల్లో తక్షణమే భద్రతా చర్యలను పెంచుతామని చార్లెస్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులందరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.