Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో కాల్పుల ఘటన.. నేషనల్ సిటిజన్ పార్టీ నేతపై కాల్పులు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇటీవల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి తిరుగుబాటు నేత, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో గుర్తింపు పొందిన షరీఫ్ ఉస్మాన్ హాది (32) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదిలా ఉండగా తాజాగా మరో విద్యార్థి నాయకుడిపై కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నేత మొతలేబ్ సిక్దార్(Md Motaleb Sikder)పై గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో దాడి చేశారు. ఈ కాల్పుల్లో సిక్దార్ తల ఎడమ వైపు నుంచి తూటా దూసుకెళ్లింది.తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
పెద్ద సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు
హాది మృతి నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. గురువారం, శుక్రవారాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన నిరసనల్లో హింస, విధ్వంసం చోటుచేసుకుంది. ఈ అల్లర్లలో ఒక హిందువు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరసనకారులు, పౌరులు గాయపడ్డారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య మరో విద్యార్థి నాయకుడిపై దాడి జరగడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లు సమాచారం.