
EVM: ఈవీఎంల భద్రతపై మళ్లీ చర్చ మొదలు.. హ్యాకింగ్ ఆధారాలు వెల్లడించిన అమెరికా అధికారి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్డ్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) హ్యాక్ చేయడం చాలా సులభమని, ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాలట్ పత్రాల వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న క్యాబినెట్ సమావేశంలో వెలువడ్డాయి. ఈవీఎంల భద్రత లోపాలను తులసీ గబ్బర్డ్ ఆధారాలతో సహా సమావేశంలో ప్రస్తావించారు.
2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో అప్పటి సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెమ్స్ చర్యలపై దర్యాప్తు జరపాలని ట్రంప్ సంతకం చేసిన పాలనాపరమైన ఉత్తర్వుల తర్వాతి రోజే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
Details
హ్యాకింగ్ చేయడం సాధ్యం కాదు : ఈసీ
తమ వద్ద ఈవీఎంల హ్యాకింగ్‌కు సంబంధించిన అనేక ఆధారాలున్నాయని తులసీ తెలిపారు. పోలైన ఓట్ల ఫలితాలను హ్యాకర్లు సులభంగా మార్చగలరని హెచ్చరించారు.
అంతేకాక స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఇటీవల ఈవీఎంల విశ్వసనీయతపై సందేహం వ్యక్తం చేస్తూ, వాటిని పూర్తిగా నిర్మూలించాలని అభిప్రాయపడ్డారు.
ఇక ఈ నేపథ్యంలో, భారత్‌లో ఈవీఎంల భద్రతపై చర్చలు చెలరేగుతుండగా, భారత కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆరోపణలను ఖండించింది.
భారతదేశంలో వినియోగిస్తున్న ఈవీఎంలు ఒక సాధారణ కాలిక్యులేటర్ తరహాలో పనిచేస్తాయని, అవి ఇంటర్నెట్ లేదా ఇన్ఫ్రారెడ్‌కు అనుసంధానం కావని ఈసీ అధికారులు స్పష్టం చేశారు.
అందువల్ల ఇవి హ్యాకింగ్‌కు గురికావడం అసాధ్యం అని వివరించారు.