ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా ? అనే అంశాన్ని పరిశీలించేందుకు మాతృ సంస్థ 'మెటా' సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. జనవరి 7న ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మెటా యాజమాన్యం చెప్పింది. ఎలాన్ మస్క్ కూడా ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధిరించేందుకు పోలింగ్ నిర్వహించారు. అందులో మెజార్టీ ప్రజలు పునరుద్ధరించాలని చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు ట్రంప్ ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించింది. ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్ధరించే విషయంలో మెటా కూడా ఇదే విధానాన్ని అవలంబించే అవకాశం ఉంది.
ట్రంప్‌కు సోషల్ మీడియా సంస్థ
2021లో క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మెటా నిషేధం విధించింది. జనవరి 6న ఫేసుబుక్‌లో ట్రంప్ చేసిన పోస్టులే కారణమని మెటా యాజమాన్యం భావించింది. క్యాపిటల్ హిల్ పై దాడి సమయంలో ట్రంప్ విద్వేషక పోస్టులు పెట్టారని, అవి తమ సంస్థ నియమాలను ఉల్లంఘించేలా ఉన్నాయని చెప్పారు మెటా నిర్వాహకులు. ఈ మేరకు ట్రంప్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. అయితే సామాజిక మాధ్యమాలు తనపై నిషేధం విధించిన తర్వాత.. ట్రంప్ తానే ఒక సొంత సోషల్ మీడియా సంస్థను 'ట్రూత్' పేరుతో ఏర్పాటు చేసుకున్నారు. ట్విట్టర్ తనపై నిషధాన్ని ఎత్తివేసినా.. ట్రంప్ తన ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోకపోవడం గమనార్హం.