Iran-USA: ఒమన్‌లో ఇరాన్-అమెరికా అణు చర్చలు.. విఫలమైతే బలప్రయోగం: ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఒమన్ వేదికగా ఇరాన్-అమెరికా (Iran-USA) మధ్య అణు అంశంపై కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రెండు దేశాలు ఎలాంటి నిర్ణయానికి వస్తాయన్నది అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫలితం ఇవ్వకపోతే బలప్రయోగానికి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడరని ఆమె స్పష్టం చేశారు. గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) మీడియాతో మాట్లాడిన లీవిట్,ఒమన్‌లో జరిగే చర్చల ద్వారా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఆశిస్తున్నారని తెలిపారు. అణ్వాయుధాలు లేని ఇరాన్ అన్న తమ డిమాండ్‌పై అమెరికా కట్టుబడి ఉందన్నారు.
వివరాలు
ఖొర్రామ్‌షహర్-4 క్షిపణుల మోహరింపు
అయితే దౌత్య మార్గాలు విఫలమైతే ట్రంప్ వద్ద మరిన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ గట్టి హెచ్చరికలు చేసినట్టు పేర్కొన్నారు. 'ఖమేనీ కలత చెందక తప్పదు' అనే వ్యాఖ్యలు చేసినట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా, టెహ్రాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన స్థావరంలో భూగర్భంగా దీర్ఘశ్రేణి ఖొర్రామ్‌షహర్-4 క్షిపణులను మోహరించినట్టు స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా ఇప్పటికే ఈ ప్రాంతంలో విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, నిఘా విమానాలతో పాటు అదనపు దళాలను మోహరించిన విషయం తెలిసిందే. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో వేలాది మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
ఇరుదేశాలు అణు చర్చలకు అంగీకారం
నిరసనకారులకు ఏమైనా హాని జరిగితే తాము జోక్యం చేసుకుంటామని టెహ్రాన్‌ను ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్య అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ దిశగా పంపడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. అనంతరం ఇరుదేశాలు అణు చర్చలకు అంగీకరించాయి. శుక్రవారం ఒమన్‌లో జరగనున్న ఈ సమావేశాల్లో అణు అంశంతో పాటు మరికొన్ని కీలక విషయాలపైనా చర్చలు జరపాలని టెహ్రాన్ భావిస్తున్నట్టు సమాచారం.