Donald Trump : విదేశీ ట్రక్కు డ్రైవర్లపై ట్రంప్ దృష్టి.. మాజీ సైనికులకు అవకాశమివ్వాలని ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న విదేశీ వలసదారుల్లో ఆందోళన నెలకొంది. వారి స్థానంలో అమెరికా మాజీ సైనికులను నియమించే ఆలోచనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తీసుకువచ్చారు. వలసదారులైన కొంతమంది డ్రైవర్లు మద్యం, మత్తు పదార్థాల ప్రభావంలో వాహనాలు నడిపి తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ట్రంప్, అలాంటి డ్రైవర్లను విధుల నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన అమలైతే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వలస డ్రైవర్లపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వివరాలు
ట్రక్కు డ్రైవర్ల విషయంలో కఠిన వైఖరి..
ఇటీవలి సంవత్సరాల్లో వేలాది మంది భారతీయులు అమెరికా రవాణా రంగంలో ట్రక్కు డ్రైవర్లుగా చేరినట్లు సమాచారం.
ప్రస్తుతం అక్కడ సుమారు లక్షన్నర మంది భారతీయులు డ్రైవింగ్ వృత్తిలో ఉన్నారని అంచనా.
వీరిలో అత్యధికులు పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన వారేనని తెలుస్తోంది.
పెన్సిల్వేనియాలో నిర్వహించిన సైనిక పెట్టుబడుల సదస్సులో ప్రసంగించిన ట్రంప్, వలసదారులైన ట్రక్కు డ్రైవర్ల విషయంలో తమ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోందని తెలిపారు.
వివరాలు
విదేశీ డ్రైవర్ల స్థానాల్లో అమెరికా మాజీ సైనికులు..
ఈ డ్రైవర్లలో చాలామంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారేనని, భారీ ట్రక్కులు నడపడానికి అవసరమైన చట్టబద్ధమైన లైసెన్సులు, అనుమతి పత్రాలు కూడా వారి వద్ద లేవని ఆరోపించారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలను తాము సహించబోమని ట్రంప్ స్పష్టం చేశారు.
విదేశీ డ్రైవర్ల స్థానాల్లో అమెరికా మాజీ సైనికులను నియమించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.