LOADING...
London: లండన్ సమీపంలో రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ,పలువురికి గాయాలు
లండన్ సమీపంలో రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ,పలువురికి గాయాలు

London: లండన్ సమీపంలో రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ,పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌లో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలోని బెడ్‌ఫోర్డ్ ప్రాంతంలో రెండు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. అయితే క్షతగాత్రుల ఖచ్చిత సంఖ్యను అధికారులు ఇంకా ప్రకటించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి రైళ్లలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ప్రమాదంలో దెబ్బతిన్న బోగీలు, పట్టాలపై నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బ్రిటన్ రవాణా శాఖ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వివరాలు 

బ్రిటన్‌లో రైలు ప్రమాదాలు అరుదే..

ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో రైలు ప్రమాదాలు చాలా అరుదుగా చోటుచేసుకుంటుంటాయి. 2023లో స్కాట్లాండ్‌లోని అవిమోర్ రైల్వే స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. ఆ ప్రమాదంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శతాబ్దం నాటి ఆవిరి ఇంజిన్ రైలు 'ఫ్లయింగ్ స్కాట్స్‌మన్' కూడా భాగమైంది. అంతకుముందు 2020లో స్కాట్లాండ్‌లోని స్టోన్‌హేవన్ సమీపంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. అనంతరం భద్రతా ప్రమాణాల్లో లోపాలను అంగీకరించిన నెట్‌వర్క్ రైల్ సంస్థపై 2023లో 6.7 మిలియన్ పౌండ్ల జరిమానా విధించారు.

Advertisement