Saudi Arabia: సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియా(Saudi Arabia)లోని జజాన్‌లో ఉన్న అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ దాడికి తామే బాధ్యులమని హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సరీ (Yahya Saree)వెల్లడించారు. తమ గగనతలంలోకి సౌదీ డ్రోన్లు చొరబడటానికి ప్రతిస్పందనగానే ఈ దాడి చేపట్టినట్లు ఆయన తెలిపారు. సౌదీ అరేబియా 'మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ' కూడా ఆదివారం తెల్లవారుజామున జజాన్‌లోని చమురు కేంద్రం వద్ద అగ్నిప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించింది. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సౌదీ అధికారులు తెలిపారు. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
వివరాలు
మౌలిక వసతుల రక్షణపై మరోసారి చర్చ
ఈ సమయంలో సౌదీ చమురు మౌలిక వసతులపై డ్రోన్ దాడి జరిగినట్లు వార్తలు వెలువడటం అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీసింది.
ప్రాంతీయ భద్రత, చమురు మౌలిక వసతుల రక్షణపై మరోసారి చర్చకు తెరతీసింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్' (Mecca Joint Defence Agreement)పై సంతకాలు చేశాయి.
మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. అది మిగిలిన రెండు దేశాలపై కూడా జరిగిన దాడిగానే పరిగణిస్తారు.
ప్రాంతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలు, ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలోనే సౌదీ అరేబియాలోని కీలక చమురు కేంద్రంపై ఈ డ్రోన్ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది