LOADING...
Dubai International Airport: ఉద్రిక్తతల మధ్య దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అలర్ట్.. గగనతలంలో చక్కర్లు కొట్టిన విమానాలు
ఉద్రిక్తతల మధ్య దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అలర్ట్.. గగనతలంలో చక్కర్లు కొట్టిన విమానాలు

Dubai International Airport: ఉద్రిక్తతల మధ్య దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అలర్ట్.. గగనతలంలో చక్కర్లు కొట్టిన విమానాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ పలు దేశాలపై దాడులను పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దుబాయ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు సమీపంలో దాడికి యత్నించినట్లు సమాచారం రావడంతో అక్కడ పొగ కమ్ముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదేసమయంలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలు గగనతలంలో కొంతసేపు చక్కర్లు కొట్టాయి. ఫ్లైట్‌రాడార్ 24 అనే ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్ డేటా ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. ఈపరిణామాలతో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అధికారులు సేఫ్టీ అలర్ట్ జారీ చేశారు. టర్మినల్ భవనాల లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక షెల్టర్లకు వెళ్లాలని సూచించారు. తదుపరి సూచనలు వచ్చే వరకు కిటికీలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించారు.

Details

అసత్య ప్రచారాలను నమ్మొద్దు

ఇదిలా ఉండగా, దుబాయి ఎయిర్‌పోర్ట్ సమీపంలో దాడి జరిగిందన్న వార్తలపై అధికారులు స్పందించారు. ఎయిర్‌పోర్ట్ వద్ద పెద్ద పేలుడు ఏదీ జరగలేదని స్పష్టం చేశారు. దాడిని అడ్డుకునే క్రమంలో కొన్ని శకలాలు పడిపోయాయని, అది చిన్న ఘటన మాత్రమేనని పేర్కొన్నారు. అయితే అది క్షిపణి దాడా లేక డ్రోన్ దాడా అన్న విషయాన్ని మాత్రం అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. అలాగే ఈ విషయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కూడా వారు ఖండించారు. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఒకటి.

Details

విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక మరోవైపు అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుళ్లు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. యూఏఈ అధికారులు స్పందిస్తూ, ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు లేదా డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement