Gold: ప్రపంచ అనిశ్చితి వేళ నెదర్లాండ్స్ కీలక నిర్ణయం.. 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు తరలింపు.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నెదర్లాండ్స్ తన బంగారం నిల్వల్లో 86 టన్నులను కొన్ని నెలల వ్యవధిలో లండన్‌కు తరలించింది. బిలియన్ డాలర్ల విలువైన ఈ పసిడిని అమెరికా, కెనడా నుంచి తీసుకొచ్చి.. లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో భద్రపరిచింది. ఈ విషయాన్ని డచ్ సెంట్రల్ బ్యాంక్ (DNB) ధ్రువీకరించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు DNB వెల్లడించింది. లండన్‌లో బంగారాన్ని నిల్వ చేస్తే.. సంక్షోభ సమయంలో అవసరమైనప్పుడు దానిని అంతర్జాతీయ మార్కెట్‌లో సులభంగా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.
వివరాలు
ఎలా తరలించారు?
ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య నెదర్లాండ్స్ బంగారం తరలింపు ప్రక్రియను వివిధ దశల్లో చేపట్టింది.
తొలుత అమెరికా, కెనడాలోని బ్యాంకుల నుంచి 27 టన్నుల బంగారాన్ని తరలించారు.
ముందుగా దానిని నెదర్లాండ్స్‌కు తీసుకొచ్చి.. అక్కడి నుంచి లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చేర్చారు.
మిగిలిన బంగారాన్ని మాత్రం మరో విధానంలో తరలించారు.
న్యూయార్క్‌లో ఉన్న పసిడిని అక్కడే విక్రయించి.. ఆ తర్వాత లండన్‌లో తిరిగి కొనుగోలు చేశారు.
బంగారాన్ని భౌతికంగా తరలించేటప్పుడు ఎదురయ్యే రవాణా సమస్యలు, నష్టభయాలను పరిగణనలోకి తీసుకుని.. వివిధ దశల్లో, భిన్నమైన మార్గాల్లో ఈ క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేసినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
వివరాలు
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
రెండు దేశాలు పరస్పరం సుంకాలు విధించుకోవడంతో ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం పడుతోంది.
మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయి.
అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరగడం, దాని ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై కనిపిస్తుండటంతో.. నెదర్లాండ్స్ బంగారం తరలింపు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లోనే ఎందుకు?
బంగారం నిల్వలను లండన్‌లో ఉంచడానికి ప్రధాన కారణాల్లో అక్కడి మార్కెట్ ఒకటి.
లండన్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మార్కెట్. దీంతో అక్కడ బంగారాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం,తాకట్టు పెట్టడం వంటి లావాదేవీలు సులభంగా జరుగుతాయి.
అంతేకాదు.. ప్రపంచంలోని అనేక దేశాలు తమ బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో భద్రపరుస్తున్నాయి.
ఈ నిల్వల కోసం బ్యాంక్ అత్యంత పటిష్ఠమైన వాల్ట్‌ను ఏర్పాటు చేసింది.
బాంబు దాడులను కూడా తట్టుకునేలా దీనిని నిర్మించినట్లు చెబుతారు.
దొంగలు డ్రిల్ చేసి లోపలికి ప్రవేశించడం కూడా దాదాపు అసాధ్యమయ్యేలా భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి.
థ్రెడ్‌నీడిల్ స్ట్రీట్‌లో ఉన్న ఈ వాల్ట్‌లో ప్రపంచంలోని మొత్తం బంగారంలో దాదాపు ఐదో వంతు నిల్వ ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఎవరి బంగారం ఎంత?
బంగారం కడ్డీలు, ఇటుకల రూపంలో ఇక్కడ భారీగా భద్రపరుస్తారు.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లోని బంగారం నిల్వల్లో 90 శాతానికి పైగా ప్రపంచంలోని 30కి పైగా దేశాల కేంద్ర బ్యాంకులు, పెద్ద సంస్థలకు చెందినదే.
లండన్‌కు చెందిన బంగారం మాత్రం ఈ నిల్వల్లో కేవలం 6 శాతం మాత్రమే. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో బంగారాన్ని ఉంచడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది.
దేశాల మధ్య లావాదేవీల కోసం బంగారాన్ని భౌతికంగా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
ఎవరి బంగారం ఎంత?
ఉదాహరణకు.. ఒక దేశానికి చెందిన అరలో ఉన్న బంగారాన్ని మరో దేశానికి సంబంధించిన అరలోకి సిబ్బంది రికార్డుల ప్రకారం మార్చితే సరిపోతుంది.
దీంతో బంగారం వాస్తవంగా కదలకుండానే దాని యాజమాన్య బదిలీ పూర్తవుతుంది.
అందుకే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రపంచ దేశాలకు కీలకమైన బంగారం నిల్వ కేంద్రంగా మారింది.
భద్రతతో పాటు అంతర్జాతీయ లావాదేవీలు, కొనుగోలు-విక్రయాలు సులభంగా నిర్వహించుకునే అవకాశం ఉండటంతో.. నెదర్లాండ్స్ తన 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు తరలించింది.