Loading...
Earthquake: మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు వద్ద 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లో అప్రమత్తత
మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు వద్ద 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లో అప్రమత్తత

Earthquake: మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు వద్ద 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లో అప్రమత్తత

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికో-గ్వాటెమాల సరిహద్దుకు ఆనుకుని ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం మధ్య అమెరికా దేశాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంప ప్రభావం మెక్సికోతో పాటు గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. భూకంపం అనంతరం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి భారీ ప్రాణనష్టం లేదా విస్తృత స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని ఆక్విలెస్ సెర్డాన్ ప్రాంతానికి నైరుతి దిశగా సముద్రంలో సుమారు 48 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు.

వివరాలు

సునామీ హెచ్చరికలతో తీర ప్రాంతాల్లో అప్రమత్తత..

ఈ ప్రకంపనలు భూమి ఉపరితలం నుంచి సుమారు 15 కిలోమీటర్ల లోతులో ఉద్భవించాయి.

ప్రధాన భూకంపం తర్వాత 4.9 నుంచి 6 తీవ్రత మధ్య పలుమార్లు అనంతర ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదైనట్లు అధికారులు తెలిపారు.

భూకంపం సముద్ర గర్భంలో సంభవించడంతో అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థతో పాటు మెక్సికో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

మెక్సికో నేవీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలకు సూచనలు జారీ చేసింది.

కనీసం ఆరు గంటల పాటు బీచ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ భద్రతా చర్యలు చేపట్టింది.

మెక్సికో, గ్వాటెమాల తీర ప్రాంతాల్లో సముద్ర అలలు ఒక మీటర్ వరకు ఎగిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అయితే భారీసునామీ ముప్పు కనిపించడం లేదని అనంతరం స్పష్టం చేశారు.

వివరాలు

భయాందోళనకు గురైన ప్రజలు..

చియాపాస్ రాష్ట్రంలోని తపచులా నగరంలో తొలుత స్వల్పంగా ప్రారంభమైన ప్రకంపనలు కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చాయి.

స్థానిక ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అలెజాండ్రా మెండోజా మాట్లాడుతూ, మొదట సాధారణ ప్రకంపనలేనని భావించామని, కానీ భూమి మరింత బలంగా కంపించడంతో సిబ్బంది అంతా వెంటనే భవనం వెలుపలికి వెళ్లినట్లు తెలిపారు.

అదే సమయంలో గ్వాటెమాల రాజధాని గ్వాటెమాల సిటీలో కూడా భూకంప ప్రభావంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.

అధికారులు పలు భవనాలను ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ADVERTISEMENT