ఈక్వెడార్ లో ఘోరం.. ప్రెసిడెంట్ అభ్యర్థి ఫెర్నాండో దారుణ హత్య
ఈక్వెడార్ దేశంలో ఘోరం చోటు చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ సాక్షాత్తు దేశ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థి దారుణ హత్యకు గురవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రెసిడెంట్ అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్సీయో (Fernando Villavicencio) బుధవారం ప్రచారం చేస్తుండగా, దుండగులు దారుణంగా కాల్చి చంపారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిరుద్యోగం, వలసల పెరుగుదల మధ్య ఈక్వెడారియన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష అభ్యర్థులు దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కిస్తామని హామీలు ఇచ్చారు.ఆగస్టు 20న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక అభ్యర్థి హత్యకు గురవడం పట్ల దేశం ఉలిక్కిపడింది.