
Elon Musk: 2026 ఆర్థిక సంవత్సరంలో డోజ్ $150 బిలియన్ డాలర్లు తగ్గించగలం: ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ వృథా ఖర్చులను సుమారు ఒక ట్రిలియన్ నుంచి రెండు ట్రిలియన్ల డాలర్ల వరకు తగ్గించగలనని పేర్కొన్న డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) అధిపతి ప్రస్తుతం తన అభిప్రాయాన్ని మార్చారు.
తాజా ప్రకటనలో ఆయన, తాము గరిష్ఠంగా 150 బిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఖర్చులను తగ్గించగలమని స్పష్టం చేశారు.
వైట్ హౌస్‌లో మీడియా సమక్షంలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్ సమావేశంలో ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని తెలియజేశారు.
"2026 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 150 బిలియన్ డాలర్ల మేరకు ప్రభుత్వ ఖర్చులను తగ్గించగలమని నేను అంచనా వేస్తున్నాను. ఈ వ్యయ నియంత్రణ చర్యలు అమెరికన్ ప్రజలకు మరిన్ని సేవలు, సౌకర్యాలు అందించగలవు," అని మస్క్ అన్నారు.
వివరాలు
మస్క్ నేతృత్వంలో డోజ్ బృందం అసాధారణంగా పనిచేస్తోంది: ట్రంప్
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ,మస్క్ నేతృత్వంలో డోజ్ బృందం అసాధారణంగా పనిచేస్తోందని ప్రశంసించారు.
అలాగే,మస్క్‌ను ఆ స్థాయిలో ఎక్కువకాలం కొనసాగిస్తూ,మరిన్ని కీలక వ్యయ నియంత్రణ సంస్కరణలను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ సలహాదారుగా మస్క్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి,ప్రభుత్వ ఖర్చుల్లో వేగంగా తగ్గింపు కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆయన,డోజ్ వృధా వ్యయాలను సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల వరకు తగ్గించగలదని ఊహించారు.
ఇక ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా మస్క్ పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది.ఈ నేపథ్యంలో ఆయనకు చెందిన కంపెనీలు అమెరికన్ ప్రభుత్వంతో భారీ కాంట్రాక్టులు పొందినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాక,అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో మస్క్ బృందం జోక్యం చేసుకొని,అత్యంత సున్నితమైన డేటాను యాక్సెస్ చేసిందన్న ఆరోపణలూ వెల్లడి అయ్యాయి.