అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో భారతీయుడు.. వివేక్ రామస్వామిపై ఎలన్ మస్క్ ప్రశంసలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే ప్రపంచదేశాల్లో చాలా ఆసక్తి నెలకొంటుంది. కానీ పోటీ చేయనున్నది భారత్ సంతతి వ్యక్తి అయితే ఆ క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే విదేశాల నుంచి యూఎస్ వచ్చేవారిలో భారతీయులే ఎక్కువగా ఉంటారు. అమెరికాలోని 37 ఏళ్ల వివేక్ రామస్వామి(భారత సంతతి) రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో నిలబడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు రిప్లబిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. మరోవైపు రామస్వామిపై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలోనే ఆయనకు చెందిన ఓ వీడియోను మస్క్ పోస్టు చేశారు.
రామస్వామి విశ్వసనీయంగా కనిపిస్తున్నారు : మస్క్
ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్‌సన్‌తో జరిగిన చర్చను ఎలన్ మస్క్ షేర్ చేశారు. రామస్వామి విశ్వసనీయంగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. రామస్వామి విద్యాభ్యాసం : కేరళకు చెందిన దంపతులకు జన్మించిన రామస్వామి, హార్వర్డ్, యేల్ వర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు చైనా, అమెరికా వ్యాపారవేత్తలను ఉయోగించుకుంటోందని రామస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసిన రాన్ డీసాంటిస్‌కు ఎలన్ మస్క్ మద్దతు ఇచ్చారు. వివేక్ రామస్వామితో పాటు భారత మూలాలు ఉన్న నిక్కీ హేలీ, హర్ష వర్దన్ సింగ్.. రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్‌కు పోటీగా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రిపేరవుతున్నారు.