డొనాల్డ్ ట్రంప్ కేసులో సంచలనం.. జడ్జీని చంపేస్తానన్న టెక్సాస్ మహిళ అరెస్ట్
అమెరికా మాజీ ప్రెసిడెంట్ క్రిమినల్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న ఫెడరల్ న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఆమెను చంపుతామని టెక్సాస్ మహిళ బెదిరించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన పోలీసులు, టెక్సాస్ రాష్ట్రంలోని ఆల్విన్ ప్రాంతానికి చెందిన అబిగైల్ జో ష్రీ అనే మహిళను అరెస్ట్ చేశారు. తొలుత అబిగైల్ జో ష్రీ ఫెడరల్ కోర్ట్‌హౌస్‌కు కాల్ చేసి బెదిరింపులకు దిగారు. యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తాన్యా చుట్కాన్ ను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ నంబర్ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ ఎన్నికల కుట్ర కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తికి బెదిరింపులు
పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే బెదిరింపు కాల్ చేసినట్లు ఆమె అంగీకరించడం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల కుట్ర కేసును న్యాయమూర్తి, జడ్జి తాన్యా చుట్కాన్ పర్యవేక్షిస్తున్నారు. అయితే జడ్జికి ఫోన్ చేసిన అబిగైల్ జో ష్రీ, మీరు మా దృష్టిలో ఉన్నారు, మేం మిమ్మల్ని చంపాలనుకుంటున్నామని బెదిరించారు. డొనాల్డ్ ట్రంప్ 2024లో అధ్యక్షుడు కాకపోతే, మేం నిన్ను హతమార్చేందుకు వస్తున్నట్లు ష్రీ బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు కోర్టు ప్రాసిక్యూటర్లు అన్నారు. ఈ నేపథ్యంలోనే ష్రీకు జైలు శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.