Loading...
Epstein: రెండేళ్లపాటు నరకం.. ఎప్‌స్టీన్‌పై మరో మోడల్‌ సంచలన ఆరోపణలు
రెండేళ్లపాటు నరకం.. ఎప్‌స్టీన్‌పై మరో మోడల్‌ సంచలన ఆరోపణలు

Epstein: రెండేళ్లపాటు నరకం.. ఎప్‌స్టీన్‌పై మరో మోడల్‌ సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

మోడలింగ్‌ రంగంలో రాణించాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన యువతుల జీవితాలు కొందరి చేతుల్లో చీకటిమయంగా మారాయి. అందమైన ప్రపంచం, ఆకర్షణీయమైన అవకాశాల పేరుతో యువతులను వలలో వేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోడలింగ్‌ ఏజెన్సీలను అడ్డుపెట్టుకుని యువతులను తన వద్దకు రప్పించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొన్ని మోడల్‌ ఏజెన్సీల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీబీసీ చేపట్టిన తాజా పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వివరాలు 

అమెరికాకు వచ్చిన నెల రోజులకే వేధింపులు

ఉజ్బెకిస్థాన్‌ నుంచి అమెరికాకు వచ్చిన నెల రోజులకే రోసా (పేరు మార్చాం) అనే 18 ఏళ్ల యువతిని ఎంసీ2 మోడల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఫ్లోరిడాలోని ఎప్‌స్టీన్‌ బీచ్‌ హౌస్‌కు ఫొటోషూట్‌ల కోసం పంపించింది.

2009లో ఈ ఘటన జరిగిన సమయంలో ఎప్‌స్టీన్‌ మైనర్‌పై లైంగిక నేరాలకు పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

అయితే, ప్రతిరోజూ జైలు నుంచి బయటకు వెళ్లి పని చేసేందుకు అతడికి అనుమతి ఉండేది.

తనకు రక్షణ కల్పించాల్సిన మోడలింగ్‌ ఏజెన్సీనే ప్రమాదంలోకి నెట్టిందని రోసా ఆరోపించింది.

వివరాలు 

తన పరిస్థితి ఏజెన్సీకి తెలుసు!

ఫొటోషూట్‌ల తర్వాత ఎప్‌స్టీన్‌ తనను వ్యక్తిగత సహాయకురాలిగా నియమించుకున్నాడని రోసా వెల్లడించింది.

ఆ తర్వాత పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. అప్పట్లో ఎంసీ2 అమెరికా విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న జెఫ్‌ ఫుల్లర్‌కు తాను ఎక్కడికి వెళ్తున్నాననే విషయం పూర్తిగా తెలుసని పేర్కొంది.

తన తిరుగు ప్రయాణానికి సంబంధించిన విమాన టికెట్‌ను కూడా ఫుల్లరే బుక్‌ చేసినట్లు ఆధారాలను చూపించింది.

ప్రస్తుతం అతడు 'ది సోర్స్‌ మోడల్స్‌' పేరుతో మరో మోడలింగ్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు.

గతంలో రోసాపై జరుగుతున్న దాడుల గురించి తనకు తెలియదని ఫుల్లర్‌ చెప్పాడు. అయితే, తాజా ఆరోపణలపై మాత్రం స్పందించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

34 మంది మహిళలను పరిచయం చేసేందుకు ప్రయత్నం

అమెరికా న్యాయశాఖ (డీఓజే) విడుదల చేసిన పత్రాలను బీబీసీ పరిశీలించింది.

ఈ క్రమంలో ఎంసీ2 ఏజెన్సీకి చెందిన కనీసం 10 మంది మోడల్స్‌ ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు లేదా అతడితో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించింది.

2005లో ఎప్‌స్టీన్‌ ఈ మోడలింగ్‌ సంస్థకు 10 లక్షల డాలర్లు చెల్లించినట్లు కూడా పత్రాల్లో వెల్లడైంది.

మరోవైపు, ఎప్‌స్టీన్‌కు 34 మంది మహిళలను పరిచయం చేసేందుకు మాజీ మోడల్‌ ఏజెంట్‌ రామ్సే ఎల్కోలీ ప్రయత్నించినట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

ఈ జాబితాలో 18 ఏళ్ల విద్యార్థిని కూడా ఉండటం గమనార్హం. అయితే, ఎప్‌స్టీన్‌ అక్రమ కార్యకలాపాల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఎల్కోలీ ఆరోపణలను ఖండించాడు.

ADVERTISEMENT

వివరాలు 

రెండేళ్లపాటు అత్యాచారం చేశాడని మరో మోడల్‌ ఆరోపణ

ఎప్‌స్టీన్‌ వేధింపులకు గురైనట్లు మరో మోడల్‌ సిమోనా (పేరు మార్చాం) కూడా తాజాగా వెల్లడించింది.

తూర్పు యూరప్‌కు చెందిన ఆమె 20 ఏళ్ల వయసులో మోడలింగ్‌ రంగంలో పనిచేస్తున్న సమయంలో

ఎప్‌స్టీన్‌ పరిచయమయ్యాడని తెలిపింది. నెక్స్ట్‌మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అధిపతి ఫెయిత్‌ కేట్స్‌ను పరిచయం చేస్తానని అప్పట్లో ఎప్‌స్టీన్‌ తనతో చెప్పినట్లు వివరించింది.

ఆ తర్వాత కేట్స్‌ తనకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలని సూచించారని, ఇందుకు సంబంధించిన వైద్యుడి వివరాలను ఎప్‌స్టీన్‌కు పంపించారని సిమోనా ఆరోపించింది.

అనంతరం ఎప్‌స్టీన్‌ తనను మోడలింగ్‌కు దూరం చేసి వ్యక్తిగత సహాయకురాలిగా నియమించుకున్నాడని పేర్కొంది.

దాదాపు రెండేళ్లపాటు తనపై అత్యాచారానికి పాల్పడుతూ,తన జీవితాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

వివరాలు 

మోడల్‌ ఏజెన్సీల పాత్రపై ఆందోళన

ఆ సమయంలో 200కు పైగా సార్లు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.

మోడలింగ్‌ ఏజెన్సీలు యువతులకు, లైంగిక దోపిడీకి పాల్పడే వ్యక్తులకు మధ్య అనుసంధానంగా మారుతున్నాయని మోడల్‌ అలయన్స్‌ వ్యవస్థాపకురాలు సారా జిఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, ఎప్‌స్టీన్‌ బాధితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది సిగ్రిడ్‌ మెక్‌కాలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎప్‌స్టీన్‌ వద్ద పనిచేసిన మహిళా సహాయకులు కూడా బెదిరింపుల మధ్య జీవించారని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఫెయిత్‌ కేట్స్‌ తరఫు న్యాయవాదులు ఈ ఆరోపణలపై స్పందించారు. ఎప్‌స్టీన్‌ ఆమెను తప్పుదోవ పట్టించాడని పేర్కొన్నారు.

అతడి అసలు స్వరూపం తెలిసి ఉంటే అతడితో ఎలాంటి సంబంధాలు కొనసాగించేవారు కాదని స్పష్టం చేశారు.

వివరాలు 

సహకరించినవారిపై చర్యలకు కొత్త బిల్లు

ఎప్‌స్టీన్‌ అకృత్యాలకు సహకరించినవారిపై చర్యలు తీసుకునేలా కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు న్యూయార్క్‌ రాష్ట్ర సెనేటర్‌ జెల్నోర్‌ మైరీ ప్రయత్నిస్తున్నారు.

ఎప్‌స్టీన్‌ నేరాల గురించి తెలిసి కూడా యువతులను అతడి వద్దకు పంపించినవారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

మరోవైపు, తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడం ద్వారా ఇతర బాధిత మహిళల్లో ధైర్యం నింపాలని రోసా భావిస్తోంది.

భయంతో మౌనంగా ఉండిపోకుండా తమకు ఎదురైన అనుభవాలను ధైర్యంగా బయటపెట్టాలని బాధితులకు పిలుపునిస్తోంది.

ADVERTISEMENT